
రికార్డులకు పెట్టింది పేరు పొట్టి క్రికెట్. ఈ ఫార్మాట్లో ఎలాంటి రికార్డయిన బద్దలు కావాల్సిందే. అసాధ్యమనుకున్న రికార్డు సాధ్యమవ్వాల్సిందే. ముఖ్యంగా టీ20ల్లో బ్యాట్స్మన్ దే హవా నడుస్తుంది. అందుకే దీన్ని ధనాధన్ క్రికెట్ అంటారు. తాజాగా దక్షిణాఫ్రికా దేశవాళీ టీ20ల్లో అరుదైన రికార్డు నమోదైంది. CSA టీ20 ఛాలెంజ్లో టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు జట్లు కలిపి 501 పరుగులతో రికార్డు సృష్టించాయి.
497 పరుగుల రికార్డు బద్దలు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. 20 ఓవర్లలో 3 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఆ తర్వాత 272 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగుల చేసి 41 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ దీంతో ఇరు జట్లు కలిపి 501 పరుగులు చేశాయి. గతంలో 2016-17 సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగా జట్ల మధ్య నమోదైన 497 పరుగుల రికార్డు బద్దలైంది. మరోవైపు ఈ మ్యాచ్లో రెండు జట్లు 36 సిక్సర్లు బాదడం విశేషం.
బ్రూవీస్ రికార్డు...
టైటాన్స్ టీమ్ ఓపెనర్ డేవాల్డ్ బ్రూవీస్ 57 బంతుల్లో 162 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీ20ల్లో మూడో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్మన్గా బ్రూవీస్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు 2013లో క్రిస్ గేల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 175 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 2018లో జింబాబ్వేపై ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ 172 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
52 బంతుల్లోనే 150 రన్స్...
సౌతాఫ్రికాలో అత్యధిక టీ20 స్కోరు చేసిన క్రికెటర్గానూ బ్రూవీస్ ఘనత సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్లో సెంచరీ సాధించిన అతి పిన్న దక్షిణాఫ్రికా క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అతను 19 ఏళ్ల 185 రోజుల వయస్సులో ఈ రికార్డును అందుకోవడం విశేషం. మరోవైపు ఈ మ్యాచ్లో బ్రూవీస్ 52 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. దీంతో టీ20లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గేల్ పేరిట ఉండేది. గేల్ 53 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ప్రస్తుతం దీన్ని బ్రూవీస్ అధిగమించాడు. అటు బ్రూవీస్ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో వేగవంతమైన దక్షిణాఫ్రికా ప్లేయర్గా నిలిచాడు.