72 ఏళ్ల తరువాత తెలంగాణలో జులైలో రికార్డ్ వర్షపాతం

 72 ఏళ్ల  తరువాత తెలంగాణలో జులైలో రికార్డ్ వర్షపాతం
  • 72 ఏండ్లలో నాలుగో హయ్యెస్ట్.. 43.51 సెంటీ మీటర్లు నమోదు
  • 1988లో అత్యధికంగా54.4 సెంటీ మీటర్లు
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

 

హైదరాబాద్, వెలుగు: జులైలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గడిచిన 72 ఏండ్లలో జులైలో కురిసిన నాల్గో హయ్యెస్ట్ వర్షపాతం ఇదే. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన రుతుపవనాలు.. మూడు వారాలు ఆలస్యంగా జూన్ 22న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 35.31 సెంటీ మీటర్లు కాగా.. 55.91 మిల్లీ మీటర్లుగా రికార్డయింది. ఒక్క జులైలోనే 43.51 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అది కూడా ఈ వారం పది రోజుల్లోనే అత్యంత భారీ వానలు కురిశాయి. 1951, జులైలో 48.59 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 1988లో 54.41 సెంటీ మీటర్ల వర్షం పడగా.. జులైలో కురిసిన అత్యధిక వర్షాల్లో ఇదే హయ్యెస్ట్. నిరుడు జులైలో 53.00 సెంటీ మీటర్ల వర్షం పడగా.. ఈ ఏడాది జులైలో 43.51 సెంటీ మీటర్లుగా రికార్డయింది. ఆయా సంవత్సరాల్లోని జులై నెలల్లో ఇది రికార్డ్ వర్షపాతమే అయినా.. ఈ ఏడాది పడినట్టు ఒకేసారి కుండపోత వర్షాలు ఆ టైంలో పడలేదు. ఈ ఏడాది జులై 26న కురిసిన అత్యంత భారీ వర్షాలు రికార్డ్ వర్షపాతానికి కారణమైంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 60 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 

ఎల్​నినో ఎఫెక్ట్ పడుతుందా?

ఈసారి ఎల్​నినో ముప్పు పొంచి ఉందని వానాకాలం ప్రారంభానికి ముందు ఐఎండీ సహా వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కానీ, జులైలో ఉత్తరాది, దక్షిణాదిన భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణల్లో అత్యంత కుండపోత వర్షాలు కురిసి.. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను మిగిల్చాయి. అయితే, ఆగస్టులో వర్షాలు ఇంతలా పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 4 లేదా 5వ తేదీ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని, అప్పటి దాకా ఎల్​నినో ప్రభావం తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.

రేపు హైదరాబాద్​లో  వర్షాలు


బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్​లోనూ రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్​నగర్, నారాయణపేట, వికారాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.