ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1446 కోట్లు

ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1446  కోట్లు

2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446  కోట్లు సమర్పించినట్లు టిటిడి అధికారికంగా ప్రకటించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని..వారిలో 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్ లో రూ. 6.30 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొంది.  శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించినట్లు తెలిపింది. ఇక 2023లో శ్రీవారి హుండీ ఆదాయం వెయ్యి కోట్లకు పైగానే సమకూరుతుందని టిటిడి  అంచనా వేసింది. 

టీటీడి వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై‌ ఉంటుంది. ‌ అయితే హుండీ ఆదాయం బట్టీ బడ్జెట్ మారుతూ వస్తుంది. ఇందులో 2019- -20 ఆర్థిక సంవత్సరానికి గాను టిటిడి రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా.. రూ.3,243.19 కోట్లుగా టీటీడీ పాలకమండలి సభ్యులు బడ్జెట్ ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనాకన్నా రూ. 50 కోట్లు అధికంగా భక్తులు హుండీకి సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. 

కరోనాతో తగ్గిన హుండీ ఆదాయం..

కరోనాతో శ్రీవారి హుండీ ఆదయం భారీగా తగ్గింది.  కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో  స్వామి వారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. దీని కారణంగా 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ కేవలం రూ. 721 కోట్ల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్డ్ చేసి‌ రూ. 2,553 కోట్లకు కుదించింది.  ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,837 కోట్లుగా పాలకవర్గం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21--22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,937.85 కోట్లకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.  కోవిడ్ ‌తరువాత భారీగా భక్తులలు రావడంతో ‌ గతంలో‌ మాదిరే హుండీ ఆదాయంతో‌ పాటుగా, కళ్యాణ‌ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు,‌ టీటీడీ భూములు లీజు‌ వంటి రూపాల్లో‌‌ ఆదాయం‌ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటుగా హుండీ కూడా పెరిగింది. గతంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు. ఈ క్రమంలో 2022లో టీటీడికి రూ. 1,446  కోట్ల ఆదాయం సమకూరింది. 

రికార్డు స్థాయిలో భక్తులు...

వేంకటేశ్వర స్వామి వారిని‌ దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి‌ ప్రతినిత్యం భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠ వాసుడికి ముడుపులు,కానులు సమర్పిస్తారు. ముడుపుల రూపంలో హుండీలో‌ కానుకలు సమర్పించడంతో పాటుగా నగదు, బంగారం, వెండి, స్థిరాస్తులు సంబంధించిన పత్రాలను సైతం ఎంతో భక్తితో‌ స్వామి వారికి సమర్పిస్తుంటారు. అయితే కరోనా వల్ల 2020‌ మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతిని రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.  దాదాపు 83 రోజుల పాటు వేంకటేశ్వరస్వామి వారికి ఏకాంతంగానే ఆలయ అర్చకులు‌ కైంకర్యాలు‌ నిర్వహించారు. ఆ తర్వాత  కొవిడ్ నిబంధనల మేరకూ పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి టీటీడి అనుమతిస్తూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో 2022 ఉగాది నుండి టీటీడీలో  కోవిడ్ నిబంధనలు తొలగించాలని‌ భావించినప్పటికీ మార్చి 20 వరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తూ‌ వస్తోంది. అయితే‌ కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా శ్రీనివాసుడి‌ దర్శనానికి దూరమైన భక్తులు.. నిబంధనలను సడలించడంతో...లక్షల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు.  దీంతో ఏడుకొండలు ప్రతినిత్యం భక్తజన సంద్రంగా మారింది. దీంతో భక్తుల సంఖ్యతో పాటుగా ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో టిటిడికి హుండీ ఆదాయం నమోదు అయ్యింది.