- ఎవరు, ఏ ల్యాండ్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? మార్చారనే వివరాలు..
- ఎప్పటికప్పుడు డిలీట్ చేసినట్టు గుర్తింపు
- ఫింగర్ ప్రింట్స్ , లాగ్స్, ఐపీ అడ్రస్ వివరాలేవీ నమోదు కాకుండా జాగ్రత్తలు
- సిద్దిపేట , సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తరహాలోనే ధరణి పోర్టల్‌లోనూ ఊహించని రీతిలో రికార్డుల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. గత ప్రభుత్వ కాలంలో అత్యంత కీలకమైన భూమి రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆ మార్పులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరక్కుండా పకడ్బందీగా డేటాను తుడిచివేసినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబ్బంది ఎలాగైతే సాక్ష్యాలను ధ్వంసం చేశారో, ఇక్కడ కూడా సాఫ్ట్‌వేర్ సాయంతో డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సమయంలో మార్పులు చేశారు, ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ ప్రక్రియ జరిగిందనే కనీస సమాచారం కూడా లేకుండా సర్వర్‌లలో మార్పులు చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఒక్క ఏడాది వరకే ఉండేలా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉండేలా మార్పులు చేసినట్లు బయటకు చెబుతున్నా.. అసలు అలాంటిదేమీ లేకుండా చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్, ఇతర సామాన్యుల హక్కులను కాలరాస్తూ బడా బాబులకు మేలు చేసేలా సాగిన ఈ వ్యవహారం ఉద్దేశపూర్వక కుట్రగా అనుమానిస్తున్నారు.
ఎవరు ఏం చేశారో తెలియట్లే
ధరణి పోర్టల్‌లో జరిగిన భూ అక్రమాలు జరిగినట్లు భావించిన ప్రభుత్వం వాటిని వెలికితీసేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. కాగాఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై మార్చే క్రమంలో ఎలాంటి నిబంధనలను పాటించలేదు. సాధారణంగా భూమి స్వభావం లేదా యాజమాన్యం మారితే దానికి సంబంధించిన పూర్తి చరిత్ర సిస్టమ్‌లో ఉండాలి. కానీ, ఈ జిల్లాల్లో జరిగిన మార్పుల విషయంలో పాత రికార్డు ఏమైందో, కొత్తగా పేరు ఎలా చేరిందో కనీస వివరాలు కూడా లభించలేదు.
ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేస్తూ, బ్యాకప్ సర్వర్లలో కూడా సమాచారం లేకుండా క్లీన్ చేసినట్లు ఆడిట్ బృందం కనుగొంది. ఇది ఒక్కటి లేదా రెండు చోట్ల జరిగిన పొరపాటు కాదని, ఒక వ్యవస్థీకృత నేరమని ఆడిట్ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒక డేటా ఎంట్రీ జరిగినప్పుడు దాని వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది వేలిముద్రలు లేదా డిజిటల్ సంతకాల ద్వారా రికార్డు కావాలి. కానీ ధరణిలో ఈ కీలకమైన ఆడిట్ లాగ్స్‌ను పని చేయకుండా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక భూమి రికార్డును మార్చినప్పుడు ఆ ఆపరేషన్ ఎవరు చేశారనేది సిస్టమ్ గుర్తించదు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ అంశం ప్రధానంగా హైలైట్ అయింది.
సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్‌లో ఉన్న లొసుగులను వాడుకుని, లాగిన్ ఐడీలను అక్రమంగా వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వ్యక్తులే కార్యాలయాల్లో కూర్చుని ఈ మార్పులు చేసినట్లు, అందుకు అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నట్లు భావిస్తున్నారు. కనీసం లాగ్ ఫైల్స్ కూడా మిగలకుండా ఎప్పటికప్పుడు 'వైపింగ్' సాఫ్ట్‌వేర్ల సాయంతో డేటాను క్లీన్ చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాప్ట్‌వేర్‌లో ఏం రికార్డు కాకుండా జాగ్రత్త
సాంకేతిక కోణంలో పరిశీలిస్తే, భూ రికార్డుల నిర్వహణలో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆడిట్ డేటా అనేవి మూడు మూలస్తంభాలు. మాస్టర్ డేటా అంటే భూమి మౌలిక వివరాలు (సర్వే నంబర్, విస్తీర్ణం, యజమాని, స్వభావం), ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే ఆ భూమి చేతులు మారిన క్రమం. ఇక ఆడిట్ డేటా అనేది ఆ మార్పులు ఎవరు, ఏ కంప్యూటర్ నుంచి, ఏ సమయంలో చేశారనే లాగ్ వివరాలను భద్రపరుస్తుంది. కానీ ధరణి పోర్టల్‌లో ఈ మూడింటినీ అస్తవ్యస్తం చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
సాధారణంగా ఒక అధికారి లాగిన్ అయినప్పుడు వారి బయోమెట్రిక్ లేదా డిజిటల్ సంతకం రికార్డు కావాలి, కానీ ధరణిలో ఈ ‘ఆడిట్ ట్రైల్’ ఆప్షన్‌ను ఉద్దేశపూర్వకంగా డిసేబుల్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల మాస్టర్ డేటాలో అక్రమ మార్పులు చేసినా, ఆ మార్పుకు కారకులు ఎవరన్నది సిస్టమ్ నమోదు చేయలేదు. పోనీ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అంటే, వాటిని కూడా ‘వైపింగ్’ సాఫ్ట్‌వేర్ల తో శాశ్వతంగా తొలగించారు. కనీసం బ్యాకప్ సర్వర్లలో కూడా లాగ్ ఫైల్స్ మిగలకుండా జాగ్రత్త పడటం చూస్తుంటే, ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో జరిగిన విధ్వంసమని స్పష్టమవుతోంది.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఉత్తదేనా ?
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్లపై ఇప్పుడు చేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. భూ అక్రమాలు ఎవరు చేశారు ? ఎం చేశారు ? ఎ కంప్యూటర్ నుంచి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందనే అక్రమాలు తెలియనప్పుడు ఆడిట్ చేసి కూడా ఉపయోగం ఏం ఉండదని తెలుస్తోంది. అదే జరిగితే గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ కేంద్రంగా జరిగిన అక్రమాలను టెక్నికల్‌గా నిరూపించలేమని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదే అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల, సిద్దిపేట కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. కానీఈ డేటా విధ్వంసంతో తలెత్తిన చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ దిగ్గజాల సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. ధ్వంసమైన రికార్డులను పునరుద్ధరించడం సాధ్యమేనా? అనే అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డేటా ఫోరెన్సిక్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.
