
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి రూ.1.61కోట్లను ఫ్రీజ్ చేశారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జాయింట్ సీపీ రంగనాథ్ శుక్రవారం అభినందించారు. అనంతరం కేసుల వివరాలు వెల్లడించారు. సిటీకి చెందిన ఓ వ్యక్తికి ‘ఫెడెక్స్ కొరియర్ సర్సీసెస్’ పేరుతో సైబర్‌నేరగాళ్లు ఫోన్‌చేశారు. సదరు వ్యక్తి పేరు మీద థైవాన్ నుంచి పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ తోపాటు కొంత ఇల్లీగల్ మెటీరియల్ ఉందని భయపెట్టారు. తాము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించారు. విడతల వారీగా రూ.98.79 లక్షలు వసూలు చేశారు.
మరో కేసులో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సిటీకి చెందిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ఇస్తామని నమ్మించి బాధితుడి నుంచి రూ.1.04 కోట్లు వసూలు చేశారు. ఇలా రెండు కేసుల్లో మోసపోయామని తెలుసుకున్న బాధితులు సిటీ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన అకౌంట్ల ఆధారంగా జమ్మూ కశ్మీర్, గుజరాత్ లోని బ్యాంకులని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు డబ్బులను డ్రా చేసుకునేలోపు ఓ కేసులో రూ.80లక్షల76వేల198, మరో కేసులో రూ.80లక్షల48వేల28 ఫ్రీజ్ చేశారు. బాధితులకు రూ.కోటి61లక్షల24వేల226 అందించారు.