8, 9 తేదీల్లో జిల్లాలకు రెడ్ అలర్ట్

8, 9 తేదీల్లో జిల్లాలకు రెడ్ అలర్ట్
  • ఎల్లుండి, ఆవలెల్లుండి వానలు దంచికొడ్తయ్
  • 8, 9 తేదీల్లో జిల్లాలకు రెడ్ అలర్ట్  
  • ఆ తర్వాత కూడా మరో రెండ్రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 8, 9 తేదీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం 11 జిల్లాలకు, మంగళవారం 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో శనివారం ఏర్పడే అల్పపీడనం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 8న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆ మరుసటి రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నది. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిరలో 9.7, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో 8.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.