ఏ భక్తులైనా అర్చనలు, అభిషేకాలు దేవుడికే చేస్తారు. కాని తమిళనాడులోని ధర్మపురి జిలా నల్లంపల్లి గ్రామస్తులు మాత్రం ఆలయ అర్చకుడికి చేస్తారు. అది కూడా ఏ పాలతోనో, పెరుగుతోనో కాదు, ఎండు కారం నీళ్లతో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
నల్లంపల్లిలోని స్థానిక కరుప్పసామి ఆలయంలో ప్రతి ఏటా ఆడి(ఆషాఢ) మాసంలో ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఉత్సవంలో బాగంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అదేటంటే కారం కలిపిన నీళ్లతో ఆలయ పూజారికి అభిషేకం జరపటం. అంతే అనుకున్నదే తడవుగా అర్చకుడు ముందుగా ఓ ఆసనంపై కూర్చుని భక్తులకు ఉపదేశం చేయగా అక్కడే సిద్దంగా బిందెలలో ఉంచిన నీటిలో 75 కిలోల దంచిన ఎండు మిరపకాయల కారం పోసి కలిపారు. అనంతరం కారం కలిపిన జలంతో అర్చకుడికి గ్రామ పెద్దలు అభిషేకంగా నిర్వహించారు. ఇది ఆ గ్రామంలో ఏళ్లు తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. అలా చేయటం ద్వారా అర్చకుడి ఉపదేశ వాక్కు ఫలిస్తుందని వారినమ్మకమట. గ్రామస్తుల ఆచారాలు ఎలా ఉన్నా కారం నీళ్లతో మనిషికి అభిషేకం విచిత్రంగానే ఉంది.
