కొనేటోళ్లు రాక.. బేరాలు లేక! ఫుట్ పాత్, చిరు వ్యాపారులకు తగ్గిన గిరాకీ

కొనేటోళ్లు రాక.. బేరాలు లేక! ఫుట్ పాత్, చిరు వ్యాపారులకు తగ్గిన గిరాకీ

హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌, వెలుగు :  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో  సిటీ జనం బయటకు రావడంలేదు. దీంతో  చిరువ్యాపారులకు గిరాకీ లేకుండాపోయింది. రోడ్లపైకి వచ్చినా కొనేవారు లేక ఖాళీగా వెనుదిరిగిపోతున్నారు. సిటీలో సుమారు 4 లక్షల పైగా చిరువ్యాపారులు ఉన్నారు. ఆగకుండా పడుతున్న వర్షాలకు కూరగాయలు, పండ్లు , ఉల్లిగడ్డలు వంటివి తడిసి పాడైతున్నాయి.  తమ వ్యాపారం సరిగా సాగడంలేదని, సంపాదన లేదని పలువురు వాపోతున్నారు. 

రోజు కిరాయి సైతం కట్టలేకపోతున్నామం టున్నారు. రోజూ వచ్చే సంపాదనతోనే కుటుంబం గడిచేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటిన ధరలతో కూరగాయలు కొని  మారువ్యాపారాలు చేసే చిరువ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వానలతో  బేరాలు లేక చిరువ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తమ  పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. 

కొనుగోలుదారులు రాక..

పండ్లు, కూరగాయలు, పూలు  రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. ఆగకుండా వర్షం పడుతుండగా జనాలు బయటకు సరిగా రాకపోతుండగా... కొనేవాళ్లు లేక పండ్లు, కూరగాయలు, పూలు పాడైపోతున్నాయి. వాటికి పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని వ్యాపారులు చెబుతున్నారు.  రెండు మూడు రోజులుగా తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. కొందరు చిరువ్యాపారులు గొడుగులకు, రెయిన్‌కోట్స్‌కి డిమాండ్‌ పెరగడంతో తాత్కలికంగా ఈ బిజినెస్‌ చేస్తున్నారు.

రద్దీ  ప్రాంతాల్లో కూడా..

సిటీలో చార్మినార్, అమీర్‌‌పేట్‌, కోఠి, దిల్​సుఖ్​ నగర్ , సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో  రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని పుట్‌పాత్‌పై ఎక్కడ చూసినా చిరువ్యాపారులతో నిండిపోతుంది. పుట్‌పాత్‌ల మీద కనీసం వంద మీటర్లు కూడా ఖాళీగా ఉండదు. సాయంత్రం అయితే పెద్ద జాతరే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వరుస వానతో  చిరువ్యాపారుల  మార్కెట్స్‌లో కొనేవారు ఎవరూ లేక బోసిపోతున్నాయి.

సాయంత్రంలోపే బంద్

వాన కంటే ముందు రోజూ 3 వేల వరకు గిరాకీ అయ్యేది. వానలతో పబ్లిక్‌ ఎవరూ రావట్లేదు. బుధవారం షాప్‌ తీస్తే రూ. 700 గిరాకీ  అయ్యింది. వానలు ఉన్న రోజులు షాప్‌ని మధ్యాహ్నం తీస్తున్నాం.  సాయంత్రం 6 గంటలలోపే 

 బంద్‌ పెడ్తున్నం.  మల్లేశ్, దిల్‌సుఖ్‌నగర్,( వాచ్‌ షాప్)
 

లాస్ అయినం

వానలతో కొనుగోలుదారులు రాక  కూరగాయలు కరాబ్‌ అయితున్నాయి. కొనడానికి వచ్చిన వారు కూడా  ప్రెష్‌గా అడుగుతున్నారు. నాలుగు రోజులుగా చాలా లాస్‌ ఐనం. - మహమ్మద్‌ ఖురేషి, మెహిదీపట్నం

కరాబ్​ అయితున్నయ్

స్కూల్‌ లేకపోవటంతో బండి మీద  పండ్లు అమ్ముతున్న.  నాన్న రోజుకు 3వేలకు పైగా అమ్ముతాడు. వానలతో జనం బయటకి రాక  ప్రూట్స్‌ కొనట్లేదు. దీంతో చాలా వరకు కరాబ్‌ అయితున్నాయి. - దిలీప్‌ బిరాధర్‌‌, కోఠి