
హైదరాబాద్ లోని సనత్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి నగర్ లో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలడంతో ఇల్లు దగ్ధం అయ్యింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చే లోపే ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి.
అసలేం జరిగిందంటే.. సత్యనారాయణకు చెందిన ఇంట్లో జూలై 3న ఉదయం ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అయితే సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది, హైడ్రా మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ పేలడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా గ్యాస్ లీకేజీ ఏమైనా జరిగిందా అని పరిశీలిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.రూ. 50 వేల ఆర్థిక సాయం చేశారు.