పంచాయతీలు బలోపేతమైతేనే వికసిత్ భారత్ : వివేక్ భరద్వాజ్

పంచాయతీలు బలోపేతమైతేనే వికసిత్ భారత్ : వివేక్ భరద్వాజ్
  • ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేయాలి: వివేక్ భరద్వాజ్

హైదరాబాద్, వెలుగు: దేశాభివృద్ధిలో పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్‌‌లోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌‌ఐఆర్‌‌డీ-పీఆర్‌‌)లో ‘స్వయంసమృద్ధ పంచాయతీ’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది ప్రతినిధులు, సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడంలో మేటిగా నిలిచిన 70 మంది సర్పంచులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. పంచాయతీలు కేవలం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకూడదని, స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమన్నారు. సర్పంచులు వినూత్న ఆలోచనలతో గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని.. స్థానిక నాయకత్వమే గ్రామాల మార్పునకు నాంది కావాలని ఆకాంక్షించారు.

ఆర్థిక బలోపేతమే లక్ష్యం: దాన కిషోర్

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలోపేతమైన పంచాయతీలతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకుంటూనే, గ్రామంలో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ పనితీరు కనబరుస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న పంచాయతీలను ఇతర సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు