భారత రాజకీయాలు మరోసారి నైతికతపై గట్టి ప్రబోధాలకు సాక్ష్యమిస్తున్నాయి. మే 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జరిగిన ఎన్నికలలో ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీలు ఊహించని రీతిలో ఓడిపోయిన తర్వాత, పాత సమీకరణాలు విచ్ఛిన్నం కావడం ప్రారంభమయ్యాయి. పార్టీలలోనే మార్పు కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఫిరాయింపులు ఇటీవలి కాలంలో వచ్చిన ఒక దుష్ప్రభావం అన్నట్లుగా, చట్టసభ సభ్యులు పార్టీలు మారడం విలువలు అపూర్వంగా పతనమవ్వడాన్ని సూచిస్తున్నట్లుగా చిత్రాలు గీయబడుతున్నాయి. కానీ, చరిత్ర వేరే కథ చెబుతోంది.
ఈరోజు పార్టీ ఫిరాయింపులను ఖండిస్తున్న ఎంతోమంది నాయకులు, వాస్తవానికి వారే ఒకప్పుడు చీలికలకు, విచ్ఛిన్నాలకు పితామహులు. కొంతమంది ముఖ్యమంత్రులు తమ మాతృ పార్టీలను వీడి, ప్రాంతీయ పార్టీలను స్థాపించి, కొత్త ప్రజా తీర్పు కోరకుండానే పదవిలో కొనసాగారు. మరికొందరు పార్టీని కాదని కొత్త పార్టీ స్థాపించినవారూ ఉన్నారు. ఒకప్పుడు తాము ఇతరులకు అందించిన అదే పొలిటికల్ ట్రీట్మెంట్ను ఇప్పుడు తాము కూడా పొందుతూ ఆగ్రహానికి గురవుతున్నారు.
శరద్ పవార్ 1967లో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశించి, దాదాపు ఆరు దశాబ్దాలుగా ప్రజా పదవిలో ఉన్నారు. అయినప్పటికీ, 1978లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పార్టీని చీల్చి, పలువురు ఎమ్మెల్యేలను తనతోపాటు తీసుకువెళ్లి, ప్రభుత్వాన్ని కూలదోసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ ఫిరాయింపు రాజకీయాలను అత్యంత విజయవంతంగా ఆచరించిన వారిలో ఒకరు.
ములాయం సింగ్ యాదవ్-సమాజ్ వాదీ పార్టీ
ప్రధాన మంత్రి వి.పి. సింగ్ నాయకత్వంలోని జనతా దళ్ వర్గంలో భాగంగా, ములాయం సింగ్ యాదవ్ 1989లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1992లో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆయన పార్టీ నుంచి విడిపోయి సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1993లో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు. ఎన్.టి. రామారావులా కాకుండా, ములాయం పార్టీని మొదటి నుండి (శూన్యం నుండి) నిర్మించలేదు.
సమాజ్‌వాదీ పార్టీ ఒక చీలిక ఫలితంగా ఏర్పడింది. అయినప్పటికీ, నేడు పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటున్న ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, తన తండ్రి ఎదుగుదలకు దోహదపడిన అదే ప్రక్రియను (పార్టీ చీలికను) ఖండిస్తున్నారు. రాజకీయ జ్ఞాపకశక్తి చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది కావచ్చు!
లాలూ ప్రసాద్ యాదవ్-ఆర్జేడీ
లాలూ ప్రసాద్ యాదవ్ జనతా దళ్ తరఫున బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1997లో పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఆయన పార్టీ నుండి విడిపోయి శాసనసభ్యులను, ఎంపీలను తనతో పాటు తీసుకువెళ్లి రాష్ట్రీయ జనతా దళ్‌ను స్థాపించారు. కొంతకాలం అధికారంలో ఉన్నారు. ఆర్జేడీ బీహార్‌లో ఒక ఆధిపత్య శక్తిగా మారింది, కానీ దాని మూలాలు పార్టీ ఫిరాయింపులలో ఉన్నాయి. ఫిరాయింపులతో పార్టీని స్థాపించిన నాయకుల్లో లాలూ కూడా ప్రముఖుడే.
మమతా బెనర్జీ – తృణమూల్ కాంగ్రెస్
1998లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇతరుల వలె కాకుండా ఆమె ఒక కొత్త పార్టీని సృష్టించారు. అయితే, 2011లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆమె కాంగ్రెస్, వామపక్షాల నుండి నాయకులను, శాసనసభ్యులను తనతో చేరమని చురుకుగా ప్రోత్సహించారు.
గోవా, మేఘాలయలో కూడా ఇలాంటి విస్తరణ ప్రయత్నాలు కనిపించాయి. ఈరోజు ఆమె సొంత పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పార్టీని వీడటం, ఆమె ఒకప్పుడు ఇతరులను ఎలా చూశారో, ఇప్పుడు ఆమె శాసనసభ్యులు కూడా ఆమెను అలాగే చూస్తున్నారని స్పష్టం చేస్తుంది.
ఉద్ధవ్ థాకరే , శివసేన
బాల్ థాకరే 1966లో శివసేనను స్థాపించి, తన కుటుంబ సభ్యులను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంచారు. అయితే, 2019లో రెండు పార్టీలు కలిసి మెజారిటీ సాధించినప్పటికీ, ఉద్ధవ్ థాకరే బీజేపీ–-శివసేన కూటమిని విచ్ఛిన్నం చేశారు. ఆయన కాంగ్రెస్, శరద్ పవార్ యొక్క ఎన్‌సీపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు.
2022లో ఆయన సొంత ఎమ్మెల్యేలలో చాలామంది ఆయనను వీడటంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు ఆయన తన నాటకీయ రాజకీయ పునరేకీకరణను విస్మరిస్తూ ఫిరాయింపులను ఖండిస్తున్నారు. దీనిని చాలామంది శివసేన మద్దతుదారులు బాల్ థాకరే వారసత్వానికి ద్రోహంగా భావించారు.
నిజం ఇబ్బందికరమైనది
దాదాపు ప్రతి ప్రధాన పార్టీ ఫిరాయింపుల వల్ల లబ్ధి పొందింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు తమకు అనుకూలమైనప్పుడు ఫిరాయించిన వారిని స్వాగతించాయి. తెలంగాణలో బీఆర్ఎస్ రెండు దఫాలు ఫిరాయింపులను ప్రోత్సహించి వారిని చేర్చుకుంది. ఇపుడు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు గురైంది. కర్ణాటకలో ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు ఏర్పడటం, పడిపోవడం పదేపదే చోటుచేసుకుంది.
పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతాయి ?
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలలో పార్టీ నాయకత్వం వల్ల ఊపిరాడనట్లు అనిపించినప్పుడు లేదా తమ రాజకీయ అస్తిత్వం అంతరించిపోతుందనే భయంతో శాసనసభ్యులు తిరుగుబాటు చేస్తారు. బ్రిటన్‌లో రాజ్యాంగ సంక్షోభాలు లేకుండానే అంతర్గత తిరుగుబాట్లు ప్రధానమంత్రులను తరచుగా మారుస్తుంటాయి. 2016 నుంచి బ్రిటన్‌కు ఆరుగురు ప్రధానమంత్రులు మారారు.
నాయకత్వాల వైఫల్యాలు
భారతదేశం 1985 నాటి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పనిచేస్తోంది. ఇది పార్టీలలోని అసమ్మతిని తీవ్రంగా పరిమితం చేస్తుంది. పార్టీలు మారే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కొత్తగా ప్రజా తీర్పు కోరాలని చాలామంది వ్యాఖ్యాతలు పట్టుబడతారు. సిద్ధాంతపరంగా ఇది గొప్పగా అనిపిస్తుంది.
ఆచరణలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉప ఎన్నికలో పోరాడటానికి అపారమైన వనరులు అవసరం. తన పార్టీ నాయకత్వం అవినీతిమయం, నిరంకుశమైనది లేదా రాజకీయంగా ఆత్మహత్యాసదృశమైనదని ఒక శాసనసభ్యుడు భావిస్తే మౌనంగా ఉండాలా? ఫిరాయింపులు అవాంఛనీయమైనవి కావచ్చు, కానీ ఎంపిక చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మరింత దారుణం.
అధినేతలూ ఒకప్పటి పార్టీ ఫిరాయింపుదారులే!
శరద్ పవార్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ థాకరేలకు ఫిరాయింపులను విమర్శించే పూర్తి హక్కు ఉంది. కానీ, వాటికి తాము అపరిచితులమని నటించే నైతిక అధికారం వారికి లేదు. పార్టీలు చీలిపోయి, వాటి నుంచి విడిపోవడం వలనే చాలామంది అధికారంలోకి వచ్చారని చరిత్ర చెబుతోంది.
భారత రాజకీయాల్లో, ఫిరాయింపులను గట్టిగా విమర్శించేవారు తరచుగా గతంలో ఫిరాయింపులలో పాల్గొన్నవారే. భారతదేశపు అసాధారణంగా కఠినమైన ఫిరాయింపుల నిరోధక చట్టం కారణంగా, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తరచుగా అసమ్మతికి అవకాశం ఉండదు.
తానే ఆరితేరిన ఫిరాయింపుదారులైన నాయకుల నుంచి తప్పించుకోవడానికి వారు ఫిరాయించక తప్పడం లేదు. విచిత్రమేమిటంటే, వంశపారంపర్య పాలనలను అలాగే, పాతుకుపోయిన పార్టీ అధిపతులను సవాలు చేయడానికి కొన్నిసార్లు ఫిరాయింపులే ఏకైక మార్గంగా మారాయి. తాము చేసిన తప్పిదాలను, ఇపుడు తమ అనుచరులు అనుసరిస్తున్నారనే భావన ఎన్ని పార్టీల అధినేతలలో కలిగిందో, వారి అంతరాత్మలకే తెలిసుండాలి !
డా. పెంటపాటి పుల్లారావు పొలిటికల్ ఎనలిస్ట్
