
- బీఆర్ఎస్ లీడర్ల వాగ్వాదం..తోపులాట
- రక్షణ వలయం మధ్య వెనుదిరిగిన మాన్విత
యాదాద్రి, వెలుగు : ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్లీడర్లతో కలిసి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బిడ్డ మాన్వితను రాయగిరిలో ట్రిపుల్ ఆర్ బాధితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతో బీఆర్ఎస్ లీడర్లు వాగ్వాదానికి దిగారు. ఇది తోపులాటకు దారి తీసింది. చివరకు ఎమ్మెల్యే కూతురు ప్రచారాన్ని మానుకొని వెనుదిరగాల్సి వచ్చింది. యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న రీజినల్‌రింగ్ రోడ్డు వల్ల తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో ప్రజలు తమ ఆస్తులను కోల్పోతున్నారు. ప్రధానంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి వాసులే ఎక్కువగా నష్టపోతున్నారు.
ఇప్పటికే పలుమార్లు భూములు కోల్పోయామని, మళ్లీ సిద్ధంగా లేమని ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నలుగురు రైతులపై కేసులు నమోదు చేసి14 రోజుల పాటు జైలుకు పంపారు. వీరిని బేడీలు వేసి కోర్టుకు తీసుకొని రావడంపై వివాదం నెలకొంది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ తీరుపై రాయగిరి వాసులు ఆగ్రహంతో ఉన్నారు.
బాధితులతో వాగ్వాదం.. తోపులాట
షెడ్యూల్ కంటే ముందునుంచే భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పైళ్ల శేఖర్‌రెడ్డి ట్రిపుల్ఆర్ బాధిత రాయగిరి వైపు అంతగా రాలేదు. కొన్ని రోజులుగా ఆయన భార్య వనిత, బిడ్డ మాన్విత ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం రాయగిరిలో మాన్విత ప్రచారానికి వచ్చారు. వెంట భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య ఉన్నారు. మాన్విత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా బాధిత రైతులు వచ్చి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఆమె వెంట వచ్చిన మద్దతుదారులు ప్రతి నినాదాలు చేశారు. నిరసనను పట్టించుకోకుండా మాన్విత ప్రచారం చేస్తుండడంతో బాధితులు వెంబడించారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి ఇది తోపులాటకు దారి తీసింది. మాన్వితను బాధితులు చుట్టుముట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు రక్షణగా నిలిచారు. పరిస్థితి చేయిదాటే విధంగా ఉండడంతో ప్రచారాన్ని నిలిపివేసిన మాన్విత కార్యకర్తల వలయం మధ్య వెళ్లిపోయారు. దీంతో బాధితులు శాంతించారు. తమకు మద్దతుగా నిలిచే పార్టీలకు, అభ్యర్థులకు అండగా నిలుస్తామని బాధితులు ప్రకటించారు.
గజ్వేల్ లో కౌన్సిలర్లకు..
సిద్దిపేట: సీఎం కేసీఆర్పోటీ చేస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి వెళ్లిన కౌన్సిలర్లకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసారం లో ఆదివారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో కొందరు మహిళలు తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని, నాయకులెవరూ తమను పట్టించుకోలేదని.. తాము ఈసారి బీఆర్ఎస్ కు ఓటు వేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గోపాల్ రెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో కౌన్సిలర్లు, నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే హరిప్రియకూ తప్పలే..
ఇల్లెందు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇల్లెందు మండలంలోని కొమరారంలో ప్రచారానికి వెళ్లిన హరిప్రియ నాయక్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కొమరారం మండల ఏర్పాటుకు కృషి చేయలేదని, పోడు పట్టాల విషయంలో అన్యాయం జరిగిందని, అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం వర్తించలేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన హరి ప్రియ నాయక్‌కు ఓటేసేది లేదన్నారు. ఈనెల 25న కూడా బయ్యారం మండలం సింగారంలో హరిప్రియ ప్రచారం నిర్వహిస్తుండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు.