హితీక్షను చంపింది చిన్నమ్మే?... తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం!

హితీక్షను చంపింది చిన్నమ్మే?... తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం!
  • హితీక్షను చంపింది చిన్నమ్మే?... తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం!
  • కోరుట్లలో ఐదేండ్ల బాలిక మర్డర్​ కేసులో కీలక మలుపు
  • సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

జగిత్యాల/కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్​లో జరిగిన ఐదేండ్ల హితీక్ష హత్యకేసు కీలక మలుపు తిరిగింది. తోడికోడళ్ల మధ్య విభేదాలతో చిన్నారిని చిన్నమ్మే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే..  ఆకుల మదన్, -లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రామ్, లక్ష్మణ్​ ఉన్నారు. పెద్ద కొడుకు రామ్‌‌‌‌ భార్య నవీన, చిన్న కొడుకు లక్ష్మణ్​ భార్య మమత తోడికోడళ్లు. 

హితీక్ష రామ్–-నవీన దంపతుల కూతురు.గత కొంతకాలంగా తోడికోడళ్లయిన నవీన, మమత మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి. శనివారం సాయంత్రం   హితీక్ష పిల్లలతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. చాలా సేపటివరకు ఇంటికి రాకపోవడంతో  చిన్నారి కోసం  కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు పక్కింటి బాత్రూమ్​లో హితీక్ష శవమై కనిపించింది. ఈ దారుణ ఘటన పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. 

కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజీ

పోలీసుల దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజీ కీలకంగా మారింది. హితీక్ష చిన్నమ్మ మమత (బాబాయ్ భార్య)..చిన్నారి హత్య జరిగిన ఇంట్లోకి అనుమానాస్పదంగా వెళ్లి, తిరిగి బయటకు వస్తుండటం, చేతిలో కవర్ పట్టుకుని వెళ్లడం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.  దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. మమత ప్రాథమికంగా నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. గత కొంతకాలంగా తోడికోడళ్ల మధ్య జరిగిన గొడవలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కోణాల్లోనూ విచారణ కొనసాగుతున్నది. 

అలాగే, ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో నివసించే 20 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతురాలి నానమ్మ లక్ష్మి, మేనత్త మానసను విచారించి, అనంతరం వదిలిపెట్టినట్టు సమాచారం. మరికొంత మందిపై అనుమానంతో విచారణ కొనసాగిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్నారి ప్రాణం తీసిన కుటుంబ సభ్యురాలు అనే వార్త స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

హితీక్షకు కన్నీటి వీడ్కోలు  

హితీక్ష మరణవార్త తెలుసుకున్న ఆమె తాత మదన్, తండ్రి రాము.. సౌదీ అరేబియా నుంచి అత్యవసరంగా బయలుదేరి వచ్చారు. మదన్ 40 ఏండ్లుగా సౌదీలో సివిల్ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, రాము గత నాలుగేండ్లుగా రిగ్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ చిన్నారిని కడసారి చూసేందుకు 24 గంటల్లోనే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం హితీక్ష అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు చిన్నారికి కన్నీటి వీడ్కోలు పలికారు.