- ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఇవ్వండి
- రాష్ట్ర సర్కారుకు టీజీవో వినతి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డీఏలను విడుదల చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( టీజీవో) కోరింది. గురువారం నాంపల్లి టీజీవో భవన్ లో టీజీవో ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అధ్యక్షతన కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలను ఈ మీటింగ్ లో ఆమోదించారు. వీటిని త్వరలో చీఫ్ సెక్రటరీకి అందచేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్ )ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ( ఓపీఎస్ ) అమలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని టీజీవో నేతలు కోరారు. 317 జీవోలో సవరణలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని, కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలన్నారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరగా రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పదేండ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లాలకు కేడర్ స్ర్టెంత్ ను ఖరారు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగుల సాధారణ బదిలీలు స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మీటింగ్ లో నేతలు ఉపేందర్ రెడ్డి, శ్యామ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
