
- నేడు పూర్తిగా నిండనున్న జూరాల రిజర్వాయర్
- నేడు శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ వరద
- గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ ఫ్లో
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్నాటక అధికారులు నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా బేసిన్ లో చాలా ఏళ్ల తర్వాత ఇంత త్వరగా నీటిని కిందికి వదులుతున్నారు. గోదావరి బేసిన్ లో మాత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఒక మోస్తరు వరద కొనసాగుతోంది.
హైదరాబాద్, వెలుగు:జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తోంది. ఎగువన కర్నాటక అధికారులు నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా బేసిన్ లో చాలా ఏళ్ల తర్వాత ఇంత త్వరగా నీటిని కిందికి వదులుతున్నారు. గోదావరి బేసిన్ లో మాత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఒక మోస్తరు వరద కొనసాగుతోంది.
కృష్ణాలో నిలకడగా వరద..
కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు కొన్ని రోజులుగా భారీ వరద వస్తోంది. ఆదివారం సాయంత్రానికి ఆల్మట్టికి 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా పవర్ హౌస్ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ కు వదులుతున్నారు. ఆల్మట్టిలో నీటిమట్టం 96 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్ పూర్తి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా ఆదివారం ఉదయానికే ప్రాజెక్టులోకి 33.47 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి నిలకడగా వరద వస్తుండటంతో మధ్యాహ్నం 1.30 తర్వాత ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 22,480 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. నారాయణపూర్ గేట్లు ఎత్తడంతో సోమవారం రాత్రికి ఆ నీళ్లు జూరాలకు చేరనున్నాయి. నారాయణపూర్ లో ఆదివారం సాయంత్రం వరకు 34.34 టీఎంసీల నీళ్లు చేరాయి. లోకల్‌గా కురుస్తోన్న వర్షాలతో పాటు పై నుంచి వస్తున్న వరదతో 9.66 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాలలో ఆదివారం ఉదయానికే 8.01 టీఎంసీల నీళ్లు చేరాయి. జూరాలను కృష్ణా వరద తాకగానే ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదలనున్నారు. సోమవారం ఉదయం జూరాల గేట్లు ఎత్తే అవకాశముందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ లెక్కన సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశముంది.
ఎస్సారెస్పీకి మోస్తరు ప్రవాహం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం 11,102 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా సాయంత్రానికి 3,720 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టులో నీటి నిల్వ 33.76 టీఎంసీలకు చేరింది. జైక్వాడి ప్రాజెక్టుకు 656, కడెం ప్రాజెక్టుకు 521, ఎల్లంపల్లికి 345 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాణహితలో ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి మేడిగడ్డకు 30,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 12 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు.
సాగర్ కూ ఇన్ ఫ్లో..
తుంగభద్ర జలాశయానికి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులోకి 24,497 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా నీటి మట్టం 20.32 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,557, నాగార్జునసాగర్ కు 1,202 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. శ్రీశైలంలో 37.25 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో 168.34 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణా బేసిన్ లో కురుస్తున్న వర్షాలతో శనివారమే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 2,991 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.