
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసి.. పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ సీఎస్ వినతిని ఎస్ఈసీ తిరస్కరించింది. గతంలో అనుకున్న మాదిరిగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల వాయిదా కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని.. ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేయాలని తీర్పు ఇస్తే.. ఆ తీర్పును అనుసరించి ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే.. ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలనడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని ఆయన అన్నారు.
‘ఏపీలో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. తొలి విడుత ఎన్నికలకు జనవరి 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం. జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. జనవరి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటాం. జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించాం. ఫిబ్రవరి 5 తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తాం. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తాం. పంచాయతీరాజ్ బాధ్యతారాహిత్యం వల్ల 3.6 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారు. దానికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతాం. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు లేవు. 2021 ఎన్నికల రూల్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలనుకున్నాం. కానీ ఓటర్ల జాబితా తయారుచేయడంలో పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా విఫలమైంది. అందుకే 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల సంఘానికి సిబ్బంది కొరత ఉంది. అయినా ఎన్నికలు నిర్వహించి తీరుతాం. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం బాధ్యత. నేను ఎప్పుడూ రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.
For More News..