జీపీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌

జీపీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌
  •   కలెక్టర్ సహా యంత్రాంగానికి ఎన్నికల సంఘం ప్రశంస 

కరీంనగర్ టౌన్, వెలుగు: మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఈక్రమంలో గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ పమేలాసత్పతి పోలింగ్ సిబ్బందికి  అభినందనలు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు కృషి  చేసిన జనరల్ అబ్జర్వర్లు వెంకటేశ్వర్లు, డీపీవో జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించారు. 11, 14, 17 తేదీల్లో ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. 

12 వేల మంది విద్యార్థులకు దంత పరీక్షలు

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని సుమారు 12 వేల మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తి ప్రభుత్వ బధిరుల ఆశ్రమ స్కూల్‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించిన డెంటల్ క్యాంపును కలెక్టర్ సందర్శించారు. బధిర విద్యార్థులకు నిర్వహించిన దంత వైద్య పరీక్షలు, చికిత్స వివరాలను క్యాంపు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు, మున్సిపల్ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స చేయించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 9 వేల మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24 మందికి చికిత్స అవసరంగా భావించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, డెంటల్ ప్రత్యేక నిపుణులు రవి ప్రవీణ్, రణధీర్, సాహిత్య, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.