కొత్త నిషేధిత భూముల జాబితా ఎప్పుడు?... లిస్ట్ లో 93 లక్షల ఎకరాలపైనే

కొత్త నిషేధిత భూముల  జాబితా ఎప్పుడు?... లిస్ట్ లో 93  లక్షల ఎకరాలపైనే
  •     రెడీ చేసి రెండు నెలలు.. ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలే
  •     పట్టా భూములు.. ప్రభుత్వ భూములు అటు ఇటు కావడంతో గందరగోళం
  •     ఎక్కువ విస్తీర్ణం కావడంతో మరోసారి రీవెరిఫై చేసే యోచనలో ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (22-ఏ) వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త జాబితా రెడీ చేసి రెండు నెలలు అవుతున్నప్పటికీ..  ఎప్పుడు అందుబాటులోకి తెస్తారనే దానిపై  స్పష్టత కొరవడింది. హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల తీరులో మార్పు రావడం లేదు. దీంతో నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. 

మరోవైపు ఏ వివాదాలు లేని నిరుపేద రైతుల పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉండంతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో రికార్డులను సరిగా తనిఖీ చేయకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమైంది. 

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు నిషేధిత భూములకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు నెలల కింద రెడీ చేశారు. దాదాపు 93 లక్షల ఎకరాలకు పైగా భూములను ఈ జాబితాలో చేర్చినట్టు రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీ ప్రాంతాలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించిన స్థలాలు ఉన్నాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన ఆస్తులతో పాటు వివిధ శాఖల ఆధీనంలోని భూములను క్రోడీకరించారు. 

ప్రధానంగా 77 లక్షల ఎకరాల మేర పక్కా ప్రభుత్వ భూమి ఉండగా.. మిగిలినది పట్టా భూములకు సంబంధించి ఉంది. ఈసారి భూదాన్ భూములను కూడా ఎక్కువ చేర్చినట్టు తెలుస్తోంది. ఈ భారీ జాబితాను రూపొందించే క్రమంలో కలెక్టర్లు మండలాల వారీగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే, ఇంత భారీ విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంతో అసలు ప్రభుత్వ భూములు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్​ అవుతుండగా, పక్కా పట్టా భూములు మాత్రం లావాదేవీలు జరగకుండా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. 

గందరగోళంగా ఉన్న జాబితాతో  రెండు రకాలుగా నష్టమే 

ఒకవైపు పట్టా భూములు, నిషేధిత జాబితా ల్యాండ్స్​లో చేర్చడం.. మరోవైపు కొంత ప్రభుత్వ భూములు ఆ జాబితా నుంచి మినహాయించడంతో  పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. ప్రధానంగా నిషేధిత భూముల జాబితా అప్​డేట్ చేయకపోవడంతో నాన్ అగ్రికల్చర్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు తావిస్తోంది. గతేడాది డిసెంబర్‌‌ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినప్పటికీ.. సాంకేతిక కారణాలతో అది ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. కొత్త జాబితా  అందుబాటులో లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దర్జాగా అక్రమ లావాదేవీలు సాగుతున్నాయి. 

కొన్ని చోట్ల ప్రభుత్వ నిషేధిత భూములను సాధారణ భూములుగా చూపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడటంతో పాటు కొనుగోలుదారులు మోసపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా సరైన జాబితాను ఆన్‌‌లైన్ చేయాలని కోరుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని భూములను కూడా అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, చేవెళ్ల వంటి మండలాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని బాధితులు వాపోతున్నారు. బిడ్డ పెండ్లి కోసమో, అత్యవసర వైద్యం కోసమో భూమిని అమ్ముకుందామని ప్రయత్నిస్తే ‘రిజిస్ట్రేషన్ కుదరదు’ అని అధికారులు చెప్తున్నారు. దీంతో అప్పుల పాలైన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, నౌహీరా షేక్ వంటి కేసుల్లో ఆస్తుల జప్తు పేరుతో అమాయక రైతుల భూములను ఇరికించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

రీ వెరిఫై చేసే యోచనలో సర్కారు..

క్షేత్రస్థాయిలో వస్తున్న ఫిర్యాదులు, రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం.. నిషేధిత జాబితాను మరోసారి పరిశీలించాలని యోచిస్తోంది. సుమారు 19 లక్షల ఎకరాల వ్యవసాయ పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. తప్పులను సవరించాలని చూస్తోంది. బాధితుల నుంచి వస్తున్న వేలాది వినతుల నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేయాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. అదే సమయంలో నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ భూములు సాధారణ భూములుగా ఉండటంతో వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఇలా రెండు రకాలుగా మార్పులు చేయాల్సి ఉంది. 

పొరపాటున జాబితాలో చేరిన పట్టా భూములను తొలగించకపోతే  లేదంటే రాబోయే రోజుల్లో భూ గొడవలు మరింత పెరిగి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. అన్నీ సవ్యంగా ఉన్న భూములను కూడా ఆంక్షల చట్రంలో పెట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. అందుకే జాబితాను పబ్లిక్ డొమైన్‌‌లో పెట్టే ముందే తుదిసారి క్షుణ్ణంగా వెరిఫై చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందే అవకాశం ఉంది.