జాబ్​లపై వైట్ పేపర్ రిలీజ్‌ చేయండి: షర్మిల

జాబ్​లపై వైట్ పేపర్ రిలీజ్‌ చేయండి: షర్మిల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత 9 ఏండ్ల నుంచి భర్తీ చేసిన ఉద్యోగాలపై ప్రభుత్వం వైట్​ పేపర్​ విడుదల చేయాలని వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అమరవీరుల బలిదానాలపై సీఎం పీఠమెక్కిన కేసీఆర్.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా..తన కుటుంబానికి మాత్రం పదవులు ఇచ్చుకున్నారన్నారు.

అప్పులు చేసి కోచింగ్స్ తీసుకున్న నిరుద్యోగులు..నోటిఫికేషన్లు లేక సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిశ్వాల్ కమిటీ లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా.. ఆ రిపోర్టును చెత్తబుట్టలో పడేశారన్నారు. 9 ఏండ్లల్లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు  58,240 మాత్రమేనని వెల్లడించారు. పేపర్ లీక్ జరిగి 5 నెలలు దాటినా ఈ కేసును ఇంకా కొలిక్కి తీసుకరాలేదని వివరించారు. ఎన్నికల వేళ మళ్లీ జాబ్ ల పేరుతో  మోసం చేయటానికి కేసీఆర్  రెడీ అవుతున్నారని పేర్కొన్నారు.