న్యూఢిల్లీ: ఇప్పటి వరకు అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న వెనెజువెలా క్రూడాయిల్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్‌గా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జనరల్ లైసెన్స్‌ను యూఎస్ ఇచ్చింది. వెనెజువెలాది ప్రధానంగా హెవీ, ఎక్స్‌ట్రా హెవీ గ్రేడ్ చమురు . రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీలు ఇలాంటి క్రూడ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలవు. దీని ద్వారా డీజిల్, కిరోసిన్, ఎల్‌పీజీ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేసి, పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లను కూడా మెరుగుపరచొచ్చు.
ఈ లైసెన్స్‌తో తక్కువ ధరలకు ఆయిల్‌ను దిగుమతి చేసుకొని, రెవెన్యూ పెంచుకోవడానికి రిలయన్స్‌కు వీలుంటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. 2019–20లో అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఆంక్షలు విధించే వరకు రిలయన్స్ ఈ టైప్ క్రూడాయిల్‌ను తరచుగా కొనుగోలు చేసేది. 2024లో తాత్కాలిక సడలింపులు వచ్చినప్పుడు మళ్లీ కొనుగోలు జరిపింది. ఈ ఏడాది వెనెజువెలా ఆయిల్ అందుబాటులోకి రావడంతో కంపెనీలు భారీగా కొనుగోలు చేయడం మొదలు పెట్టాయి.
స్విస్ ట్రేడింగ్ కంపెనీ విటోల్ ద్వారా రిలయన్స్ 20 లక్షల బ్యారెల్స్ కొనుగోలు చేసింది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ కూడా ఈ స్విస్ కంపెనీ ద్వారా 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాయి. అమెరికా–ఇండియా వాణిజ్య ఒప్పందం తర్వాత రష్యా ఆయిల్ దిగుమతులు తగ్గుతుండగా, వెనెజువెలా ఆయిల్ దిగుమతులు పెరుగుతున్నాయి.
