
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ కంపెనీ బీపీలు కలిసి ఢిల్లీలో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్‌ను ఏర్పాటు చేశాయి. జియో–బీపీ బ్రాండ్ కింద దేశంలో ఫ్యూయల్ అవుట్‌లెట్లను, ఛార్జింగ్ స్టేషన్లను ఈ ఇరు కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచేందుకు వివిధ టెక్నాలజీ పార్టనర్లతో, ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని రిలయన్స్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ‘జియో–బీపీ అతి పెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్‌ను ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసింది. బ్లూస్మార్ట్ కంపెనీ ముఖ్యమైన కస్టమర్‌గా ఉంది’ అని వివరించింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) కిందటేడాది నవి ముంబైలో తమ మొదటి జియో–బీపీ బ్రాండ్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తుస్తోంది. కాగా, రిలయన్స్‌కు చెందిన 1,400 పెట్రోల్ పంపులు, 21 ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) స్టేషన్లలో 49 శాతం వాటాను 2019 లో బీపీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పెట్రోల్ పంపులను 5,000 కు పెంచాలని ఆర్‌బీఎంఎల్ టార్గెట్‌గా పెట్టుకుంది.