అమెరికాలో చిక్కుకుపోయిన భార‌తీయుల‌కు రిలీఫ్..

అమెరికాలో చిక్కుకుపోయిన భార‌తీయుల‌కు రిలీఫ్..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. గ‌త ఏడాది చివ‌రిలో తొలి కేసు న‌మోదు కాగా.. మూడున్న‌ర నెల‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 200 దేశాల‌కు వ్యాపించి 19 ల‌క్ష‌ల 34 వేల మందికి సోకింది. ఇప్ప‌టి వ‌రకు ల‌క్షా 20 వేల మందిని బ‌లి తీసుకుంది. ఈ మ‌హ‌మ్మారి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాప్తిస్తుండ‌డంతో ప్ర‌పంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అన్ని దేశాలు విమాన ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేసేశాయి. దీంతో ఉద్యోగాల కోసం, స్ట‌డీస్ కోసం అమెరికా వెళ్లిన మ‌నోళ్లు అక్క‌డే ఉండిపోయారు. వారిలో చాలా మంది వీసాల గ‌డువు ముగిసిపోయింది. అయితే కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో తిరిగి స్వ‌దేశం వ‌చ్చే వీలు లేక‌పోవ‌డంతో అక్క‌డే చిక్కుకుపోవ‌డంతో వారి మ‌రికొన్నాళ్లు అక్క‌డే ఉండేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కొద్ది రోజులుగా భార‌త ప్ర‌భుత్వం కోరుతోంది. మ‌న దౌత్య అధికారుల సంప్ర‌దింపుల‌తో దీనికి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంది అమెరికా ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం.

H-1B వీసా హోల్డ‌ర్స్ కి 8 నెల‌ల గ‌డువు

వీసా గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ H-1Bతో పాటు ఇత‌ర నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల‌కు అమెరికాలో ఉండే వీలు క‌ల్పిస్తున్న‌ట్లు సోమ‌వారం వెల్ల‌డించింది. సాధార‌ణంగా అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్లే విదేశీయుల‌కు జారీ చేసే H-1B వీసా గ‌డువు ముగిసిన త‌ర్వాత అదే కంపెనీలో ప‌ని చేసేందుకు కాంట్రాక్ట్ పొడిగిస్తే మ‌రో 240 రోజులు అక్క‌డ ఉండొచ్చు. ఒక వేళ అలా జ‌ర‌గ‌క‌పోతో మ‌రో కంపెనీలో ఉద్యోగం చూసుకునేందుకు 60 రోజుల స‌మ‌యం ఇస్తారు. ఆ స‌మ‌యం అక్క‌డే మ‌రో కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటే వీసా గ‌డువు మ‌ళ్లీ పొడిగిస్తారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆర్థికంగా గ‌డ్డు రోజులు న‌డుస్తుండ‌డంతో H-1B ఎక్స్ పైర్ అయిన వాళ్లు కొత్త ఉద్యోగాలు పొందే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీంతో ఇటీవ‌ల H-1B గ‌డువు ముగిసిన‌, మ‌రికొద్ది రోజుల్లూ పూర్త‌వుతున్న ఇండియ‌న్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన భార‌త ప్ర‌భుత్వం, అమెరికాతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు 8 నెల‌ల గ‌డువు ఇస్తూ ప్ర‌క‌టన చేసింది అమెరికా సిటిజ‌న్ షిప్ అండ్ ఇమిగ్రేష‌న్ స‌ర్వీసెస్ (USCIS). ఆ లోపు కూడా కొత్త‌ ఉద్యోగాలు చూసుకోలేక‌పోతే తిరిగి భార‌త్ రావాల్సిందే, లేనిప‌క్షంలో ఆ దేశం బ‌ల‌వంతంగా డిపోర్ట్ చేస్తుంది.

ఇత‌ర వీసా హోల్డ‌ర్స్ కూడా..

హెచ్1బీతో పాటు ఇత‌ర నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డ‌ర్స్ కూడా త‌మ వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉండొచ్చ‌ని తెలిపింది USCIS. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో డీపోర్టేష‌న్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది. అయితే వీసా గ‌డువు ముగిసిన వాళ్లు ఎక్స్ టెన్ష‌న్ ఆఫ్ స్టే (EOS) లేదా చేంజ్ ఆఫ్ స్టేట‌స్ (COS) కోసం అప్లై చేసుకోవాల‌ని సూచించింది. ఈ ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారి హెచ్1బీ లేదా హెచ్4 వీసాల‌ను విజిట‌ర్ వీసా (బీ2)గా మార్పు చేసి కొన్నాళ్ల‌పాటు అక్క‌డే ఉండే వీలు క‌ల్పించ‌నుంది అమెరికా. దీని ద్వారా 6 నెల‌ల వ‌ర‌కు అక్క‌డ ఉండొచ్చు. అయితే వీసా వీవ‌ర్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా వెళ్లిన వారికి గ‌రిష్టంగా 60 రోజుల వ‌రకు అక్క‌డ ఉండే వీలు క‌ల్పిస్తామ‌ని USCIS తెలిపింది.