మత రాజకీయాలను తరిమి కొట్టాలి

మత రాజకీయాలను తరిమి కొట్టాలి

హైదరాబాద్, వెలుగు: దేశంలో మత రాజకీయాలు, మూఢ నమ్మకాలను తరిమికొట్టేలా ప్రజా పోరాటాలు రావాలని, కళాకారులు.. రచయితలు రంగంలోనికి దిగాల్సిన అవసరముందని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మానవ హక్కులు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. సినీ నటుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు రాసిన ‘నేను నడిచిన బాట’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్​లోని మగ్ధూం భవన్​లో సురవరం ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో జరిగిన అనేక మార్పులు, పార్టీ, యువజన, ప్రజా నాట్యమండలికి సంబంధించిన సమాచారన్ని పుస్తకంలో పొందుపర్చారని కొనియాడారు. నల్లూరి జీవిత చరిత్రలోని అనేక అంశాలు యువతరానికి స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రతి జర్నలిస్టు కూడా తమ జీవిత చర్రితను రాయాలని సూచించారు. ప్రజానాట్య మండలి, యువజన విభాగానికి నల్లూరి వెంటకేశ్వర్లు, కందిమళ్ల ప్రతాపరెడ్డి 2 కండ్ల లాంటి వాళ్లని సురవరం కొనియాడారు.