హైదరాబాద్, వెలుగు: ఎలాంటి శాస్త్రీయ విధానాలు అవలంబించకుండా, సర్వేలు చేపట్టకుండా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లన్నీ రాజ్యాంగ విరుద్ధమేనని తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లో చట్ట విరుద్ధంగా ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న మమతాబెనర్జీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నైజం బయటపడిందని చెప్పారు. ఏపీ, తెలంగాణలోనూ బీసీ-ఈ కోటా పేరుతో ముస్లింలకు అమలు చేస్తున్న మతపరమైన రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ విరుద్ధమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీసీల హక్కులను కాలరాసేలా, వారిని అణిచివేసేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మైనారిటీలను సంతృప్తిపర్చేందుకు బీసీల ప్రయోజనాలను తాకట్టుపెట్టడం దుర్మార్గమని విమర్శించారు.
