Weather update: రెమల్​ తుఫాన్​ ఎఫెక్ట్​.. కోల్​కతా ఎయిర్​ పోర్ట్​ బంద్​

Weather update: రెమల్​ తుఫాన్​ ఎఫెక్ట్​.. కోల్​కతా ఎయిర్​ పోర్ట్​ బంద్​

 Remal Cyclone: రెమల్ తుఫాన్ దూసుకువస్తోంది. ఆదివారం ( మే 26)  రాత్రికి తీరం దాటనున్న రెమల్ తుఫాన్.. ఆ తర్వాత అల్లకల్లోలం సృష్టించనున్నట్లు భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 24 గంటల పాటు కోల్‌కతా విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిపివేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ రెమల్ తుఫాను తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రెమల్ తుఫాన్‌గా మారి.. ఆదివారం ( మే 26)  తీరాన్ని తాకనుంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. రెమల్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. 

రెమల్ తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇక రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య గంటకు 11 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఆదివారం రాత్రి తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేయాలని కోల్‌కతా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాప్రకటించింది. రెమల్ తుఫాన్ దెబ్బకు ఏకంగా 24 గంటల పాటు అన్ని విమాన సర్వీసులను నిలిపివేయాలని సూచించింది. 

394 విమానాలు రద్దు

రెమల్ తుపాను కారణంగా రైలు, రోడ్డు ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఈరోజు( May 26)  మధ్యాహ్నం నుంచి 24 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. అంతర్జాతీయ, దేశీయ 394 విమానాలు రద్దు చేయబడ్డాయి. ఉత్తర ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా వంటి కోస్తా జిల్లాల్లో రెండు రోజులు ( మే 27,28) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. NDRF అప్రమత్తంగా ఉంది. ఆర్మీ, నేవీ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ తుఫాన్ ప్రభావంతో మే 28 వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.