
- కవ్వాల్టైగర్రిజర్వ్ పాలగోరిలో గుడిసెలు వేసుకున్న గిరిజనులు, పోడు కోసం చెట్లు నరికివేత
- అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి
- పాలగోరి పూర్తిగా అటవీ ప్రాంతమే : ఎఫ్‌డీవో
జన్నారం/జన్నారం రూరల్, వెలుగు : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందన్‌పల్లి రేంజ్ కవ్వాల్ బీట్ పాలగోరి అటవీ ప్రాంతంలో పోడు సాగు కోసం చెట్లను కొట్టడమే కాకుండా.. ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేసిన 26 మంది ఆదివాసీలను ఆఫీసర్లు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు), జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన పలువురు గిరిజనులు తమ పూర్వీకులు పాలగోరి అటవీ ప్రాంతంలో నివాసం ఉన్నారని పేర్కొంటూ అక్కడ గుడిసెలు వేసుకున్నారు.
దీంతో పాటు పోడు సాగు కోసం అటవీ ప్రాంతంలోని చెట్లను నరికివేశారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు గుడిసెలను తొలగించేందుకు వెళ్లగా.. వారిపై ఆదివాసీలు దాడి చేశారు. అనంతరం 350కి పైగా టేకుచెట్లను నరికి వేశారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చట్టాల కింద గిరిజనులపై కేసులు నమోదు చేశారు. శనివారం సాయంత్రం 26 మందిని అరెస్ట్ చేసి ఆదివారం తెల్లవారుజామున లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని జిల్లా జైలుకు తరలించారు.
పాలగోరి అటవీ ప్రాంతమే...
పాలగోరి పూర్తిగా అటవీ ప్రాంతమేనని, అది కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో భాగమని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్‌రావు చెప్పారు. జన్నారం ఎఫ్‌ఆర్‌వో సుష్మారావుతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. పాలగోరి సర్వేనంబర్ 112లో ఉన్న 9,360 ఎకరాలు టైగర్రిజర్వ్కోర్ఏరియా పరిధిలోకి వస్తుందన్నారు.
2022లో మంచిర్యాల ఆర్డీవో సైతం పాలగోరిని అటవీ ప్రాంతంగా ధ్రువీకరించారని, ఈ విషయాన్ని ఆదివాసీలకు చెప్పినా వినిపించుకోకుండా గత నెల 18న టేకు చెట్లను నరికివేశారని, అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్అధికారులపై దాడి చేశారన్నారు. గిరిజనులు ఇప్పటికైనా అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.