ఓయూ చుట్టూ ఉన్న ముళ్ల కంచె తొలగింపు

ఓయూ చుట్టూ ఉన్న ముళ్ల కంచె తొలగింపు

ఓయూ, వెలుగు:  పదేండ్లుగా ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించారు. గత బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టూ వేసిన కంచెను తొలగించినట్లే ఓయూ పరిపాలనా భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో బిల్డింగ్‌ ప్రహరీ గోడలపై ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను గురువారం అధికారులు, ఓయూ పోలీసులు దగ్గరుండి తొలగించారు. 2014లో బీఆర్‌‌ఎస్  అధికారంలోకి వచ్చాక విద్యార్థి ఉద్యమాలను అణచివేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న సాకుతో దారులన్నీ మూసివేసింది. 

సమ స్యలపై విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌కు వచ్చి ఆం దోళన చేస్తున్నారని, వీటిని అడ్డుకునేందుకు అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బిల్డింగ్‌ చుట్టూ ముళ్ల కంచెలు వేసి, ప్రధాన గేట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, రెండున్నరేండ్ల క్రితం వైస్ చాన్స్‌లర్‌‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్ విద్యార్థులపై అనేక ఆంక్షలు విధించారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోపలికి ప్రవేశించి క్యాంపస్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారంటూ వర్సిటీకి ఇరువైపులా ఉన్న రెండు ప్రధాన ద్వారాలను రాత్రి సమయాల్లో మూసివేయించారు. క్యాంపస్ రోడ్డు గుండా ఆర్టీసీ సిటీ బస్సులను నిషేధించడంతో బస్సులు అందుబాటులోకి లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

ఇది స్టూడెంట్స్‌ విజయం..

వర్సిటీలో రోజు రోజుకు సమస్యలు పెరగడంతో వాటి పరిష్కారానికి విద్యార్థులు రోడ్లపై బైటాయించి ఆందోళనకు దిగారు. ఈ నెల 15న ఓయూ లైబ్రరీ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను ముట్టడించారు. కాగా, విద్యార్థి సంఘాల పోరాటంతో ఓయూ వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఉన్న ముళ్ల కంచెలు తొలగించారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇది విద్యార్థుల విజయమన్నారు.