బోర్నవిటా హెల్త్ డ్రింక్​ కాదు

బోర్నవిటా హెల్త్ డ్రింక్​ కాదు

న్యూఢిల్లీ: బోర్నవీటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్  జాబితా నుంచి తొలగించాలని ఈ కామర్స్  కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్  కంపెనీలు వారి పోర్టల్స్ లో బోర్నవీటా, ఇతర బేవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్  జాబితాలో ఉంచకూడదని సూచించింది. ఫుడ్  సేఫ్టీ అండ్  స్టాండర్డ్స్  అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చట్టం నిర్వచించిన ప్రకారం బోర్నవీటా, ఇతర బేవరేజెస్ లో ఎలాంటి హెల్త్ డ్రింక్స్  లేవని జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం (ఎన్సీపీసీఆర్) జరిపిన విచారణలో తేలిందని ఆ శాఖ తెలిపింది. 

ఈమేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈనెల 10న ఒక నోటిఫికేషన్  జారీ చేసింది. అనుమతించిన పరిమితి కన్నా ఎక్కువగా బోర్నవీటాలో షుగర్  లెవెల్స్  ఉన్నాయని ఎన్సీపీసీఆర్  జరిపిన విచారణలో వెల్లడైందని తెలిపింది. కాగా, సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్  గైడ్ లైన్స్ ను పాటించడంలో ఫెయిలైన, పవర్  సప్లిమెంట్లను ‘హెల్త్ డ్రింక్స్’ గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐను ఎన్సీపీసీఆర్  ఇంతకుముందు కూడా ఆదేశించింది. ఏదైనా పానీయం లేదా పదార్థాన్ని హెల్తీగా ప్రచారం చేసుకోవడం ఎఫ్ఎస్ఎస్ఏఐ రూల్స్​కు విరుద్ధం. అలాగే, డెయిరీ ఆధారిత పానీయాలు, లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబులింగ్ చేయరాదని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.

యూట్యూబర్  వీడియోతో వెలుగులోకి..

ఆరోగ్యకరమైన ప్రయోజనాలేవీ లేకపోగా బోర్నవీటాలో మోతాదుకు మించి షుగర్  లెవెల్స్ ఉన్నాయని ఒక యూట్యూబర్ తన వీడియోలో పేర్కొన్నాడు. పరిమితికి మించిన చక్కెరతో పాటు కోకా సాలిడ్స్, హానికరమైన రంగులు కూడా బోర్నవీటాలో ఉన్నాయని, దీనివల్ల పిల్లలకు క్యాన్సర్​ ముప్పు పొంచి ఉందని ఆరోపించాడు.