టిమ్స్​లో 7 నెలలుగా కొనసాగుతున్న రెనోవేషన్ పనులు

టిమ్స్​లో 7 నెలలుగా కొనసాగుతున్న రెనోవేషన్ పనులు

హైదరాబాద్, వెలుగు: సిటీకి నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఐదేండ్లు అవుతోంది. కానీ నేటికీ ఏ ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. ఇందులోని ఒకటి గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్. కరోనా టైంలో ప్రారంభించినప్పటికీ తర్వాత కొన్ని నెలలుకే రెనోవేషన్ పేరుతో క్లోజ్ చేశారు. ప్రస్తుతం అక్కడ కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుతున్నాయి. డైలీ కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ఓపీకి వస్తున్నారు. సిటీలోని బస్తీ దవాఖానలు, పీహెచ్ సీలతో పోలిస్తే టిమ్స్ కు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లతో పాటు ఐసీయూ బెడ్లు, ఓపీ బ్లాక్​ సపరేట్ చేయడం, ఇతర పనుల ఏడు నెలల కిందట కోసం టిమ్స్​లోని ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా బంద్ చేశారు. అయితే రెనోవేషన్​పనులు కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. ఇప్పటివరకు 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటే ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా టైంలో టిమ్స్​లో పనిచేసిన డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఇతర హాస్పిటల్స్​కి పంపించారు. ఓపీ సేవలు అందించేందుకు ప్రస్తుతం ఐదుగురు డాక్టర్లు, 15 మంది స్టాఫ్ నర్సులు సహా మొత్తం 60 మంది మాత్రమే ఇక్కడ  పనిచేస్తున్నారు. మిగిలిన మూడు సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం కోసం ఇటీవల టెండర్లు పూర్తయ్యాయి. వాటిని పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి.

అప్పుడు మాత్రమే..

కరోనా టైంలో టిమ్స్​ను ఉపయోగించుకున్న ప్రభుత్వం తర్వాత పట్టించుకోలేదు. కరోనా పేషెంట్ల కోసం వెయ్యి పడకలను అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించి కొన్నాళ్లకే మూసేశారు. 7నెలల్లో రెనోవేషన్​పనులు 10 శాతం కూడా కాలేదు. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అప్పట్లో హడావుడిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదనేది చర్చనీయాంశమైంది. అసలు టిమ్స్​ హాస్పిటల్ ఇక్కడే ఉంటుందా? లేదా అని జనం చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు.  

టెండర్లు పూర్తి.. నిర్మాణాలెప్పుడో?

అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఇటీవల శంకుస్థాపన చేశారు. అల్వాల్ లో 28.41ఎకరాల్లో నిర్మించేందుకు రూ.897 కోట్లు, గడ్డిఅన్నారంలో 31.36 ఎకరాల్లో రూ.900 కోట్లతో, ఎర్రగడ్డలో 60 ఎకరాల్లో రూ.882 కోట్లతో హాస్పిటల్స్​నిర్మించనున్నారు. ఈ పనులకి సంబంధించిన టెండర్లు వారం క్రితం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఐదేళ్ల తరువాత టెండర్లు పూర్తయ్యాయి. మరి నిర్మాణాలు మొదలై ఎప్పుడు పూర్తవుతాయో వేచి చూడాలి.