బై బై ఇండియా.. దేశం వదిలి వెళ్ళిపోతున్న కోటీశ్వరులు

బై బై ఇండియా.. దేశం వదిలి వెళ్ళిపోతున్న కోటీశ్వరులు

దేశం విడిచి వెళ్లిపోతున్న కోటీశ్వరుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అందులోనూ ఈ ఏడాది 6,500 మంది దేశం విడిచి వెళ్లే అవకాశముందని వలస దారులను ట్రాక్ చేసే 'హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023' నివేదించింది. ఈ జాబితాలో 13,500 మందితో చైనా అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానం(6,500), యునైటెడ్ కింగ్‌డమ్ (3,200) మూడవ స్థానంలో ఉన్నాయి.

ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కంటే (భారత కరెన్సీలో 8 నుంచి 10 కోట్లు) ఎక్కువ నెట్ వర్త్ ఉన్న వారిని కోటీశ్వరులుగా అంచనా వేస్తున్నారు. ఒకరకంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్తలు పెరుగుతుండగా, అంతే సంఖ్యలో మిలియనీర్లు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ వలసలు ప్రపంచవ్యాప్తంగా 2023 చివరినాటికి 1,22,000, 2024 చివరినాటికి 1,28,000 పెరిగే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సీఈఓ డాక్టర్ జుర్గ్ స్టెఫెన్ వెల్లడించారు.

ఎక్కడికి తరలిపోతున్నారు..

వలస వెళ్తున్న కోటీశ్వరులు తమ కొత్త నివాసం కోసం వెతుకుతున్న దేశాల్లో యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2023లో అత్యధికంగా 5,200 మంది మిలియనీర్లు ఆస్ట్రేలియా చేరే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ రిపోర్ట్ అంచనా వేసింది. గతేడాది రికార్డు స్థాయిలో మిలియనీర్లను ఆకర్షించిన దుబాయి.. ఈ ఏడాది 4,500 మంది కొత్త మిలియనీర్‌లను స్వాగతించనున్నట్లు తెలిపింది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనుకూలమైన పన్ను వాతావరణం, వ్యాపార అభివృద్ధికి సకల సౌకర్యాలు, సురక్షితమైన.. శాంతియుత వాతావరణం కలిగివుండటం వలసలకు దారితీస్తున్నాయి.