ఎండలకు 60 వేల మంది చనిపోయారు

ఎండలకు 60 వేల మంది చనిపోయారు

సూర్యుడి భగభగలు తట్టుకోలేక గతేడాది యూరప్ వ్యాప్తంగా 60వేల మంది మరణించినట్లు నేచర్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది. ఇందులో 18,010 మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉండగా, స్పెయిన్ (11,324), జర్మనీ (8,173) రెండు.. మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇటలీలో ప్రతి లక్ష మంది జనాభాలో 295 మరణించినట్లు నేచర్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది. ఈ జాబితాలో గ్రీస్ (280), స్పెయిన్ (237), పోర్చుగల్ (211) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వేడి గాలులు, కరువులు, అడవుల కార్చిచ్చు వంటి ఘటనల వల్ల ఈ మరణాలు సంభవించినట్లు నివేదికలో తెలిపింది. మరణించిన వారిలో అత్యధికంగా వృద్ధులు, మహిళలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. 79 ఏళ్లు పైబడిన వారిలో 36,848 మరణించినట్లు అంచనా వేయగా.. 65-79 ఏళ్లలోపు వారిలో 9,22 మరణాలు, 65 ఏళ్లలోపు వారిలో 4,822 మరణాలు సంభవించినట్లు అంచనా వేశారు.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 2030 నాటికి ప్రతి వేసవిలో సగటున 68వేల కంటే ఎక్కువ అకాల మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాగే, 2040 నాటికి 94వేల కంటే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటాయని అంచనా వేశారు. కాగా, యూరప్‌లో అత్యధికంగా 2003లో 70వేల కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.