Yash Dayal: పోలీస్ స్టేషన్‌లో దయాల్‌పై కేసు.. ఆర్సీబీ పేసర్‌పై నిషేధం

Yash Dayal: పోలీస్ స్టేషన్‌లో దయాల్‌పై కేసు.. ఆర్సీబీ పేసర్‌పై నిషేధం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ కు ఊహించని షాక్ తగిలింది. 27 ఏళ్ల ఈ ఉత్తర ప్రదేశ్ పేసర్ లోకల్ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఆగస్టు 17న యూపీ టీ20 లీగ్ మూడవ ఎడిషన్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఆడకుండా యష్ దయాల్ పై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ బోర్డు అతనిపై  నిషేధం విధించింది. UPCA వర్గాల సమాచారం ప్రకారం, దయాల్ పై కేసు నమోదవడంతో అతను ఈ టోర్నీలో ఆడేందుకు అర్హత లభించలేదు. ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన దయాల్ ను గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు కొనుగోలు చేసింది.

ఘజియాబాద్ కు చెందిన ఒక మహిళ తనపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని.. ఐదు సంవత్సరాలుగా శారీరక సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించిన తర్వాత దయాల్ పై జూలై 6న BNS సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 21, 2025న ఆమె ముఖ్యమంత్రి ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్ (IGRS) ద్వారా ఈ  ఆర్సీబీ పేసర్ పై ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, దయాల్ తన అరెస్టును నిలిపివేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన రిట్ పిటిషన్‌లో, వివాహం సాకుతో ఆ మహిళతో ఎటువంటి శారీరక సంబంధం ఏర్పరచుకోలేదని దయాల్ తన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

యష్ దయాల్ ను రూ.7 లక్షలకు గోరఖ్‌పూర్ లయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దయాల్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ   జట్ల తరపున ఆడాడు. 43 మ్యాచ్‌ల్లో 41 వికెట్లను పడగొట్టాడు. 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. 2023లో అతనికి చేదు జ్ఞాపకం మిగిలింది. దయాల్ బౌలింగ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదడంతో అతనికి కష్టకాలం మొదలయింది. అయితే 2024 లో రాయల్ ఛాలెంజర్స్ జట్టులో చేరిన దయాల్ నిలకడగా రాణించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.