తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా వార్నింగ్

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా వార్నింగ్
  • లీడర్ల మధ్య కోల్డ్ వార్ పై అసంతృప్తి
  • పరస్పర విమర్శలు చేసుకోవద్దని ఆదేశం
  • మీడియాకు లీకులు ఇవ్వొద్దని దిశానిర్దేశం
  • టికెట్ ఆశావహుల బలాబలాలపై ఆరా
  • నోవాటెల్ లో ముగిసిన ముఖ్యనేతల భేటీ

శంషాబాద్: పార్టీలో స్థానిక నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు, మీడియాకు లీకులపై కేంద్ర హోంశాఖ మంత్రి సీరియస్ అయ్యారు. ఇవాళ శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన  నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ పైనే ఆయన ప్రధానంగా ఫోకస్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. 

నేతల్లో సమన్వయం లోపించిందని, నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని, మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది.  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా  రాజకీయ పరిస్థితులను బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి అమిత్ షాకు వివరించారు. ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు, వారి బలాబలాలు, సమర్థతపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.