బాబర్ ఆజాంకు గడ్డుకాలం.. పెత్తనం చెలాయిస్తున్న అఫ్రిది అల్లుడు

బాబర్ ఆజాంకు గడ్డుకాలం.. పెత్తనం చెలాయిస్తున్న అఫ్రిది అల్లుడు

పాకిస్తాన్ క్రికెట్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం, ప్రస్తుత టీ20 సారథి షాహీన్ అఫ్రిది మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరికి పడదని క్రికెట్ ప్రపంచానికి మొత్తం తెలుసు. గతంలో బాబర్ కెప్టెన్సీలో ఎన్ని అవమానాలు ఎదురైనా తలొంచుకు వెళ్లిపోయిన అఫ్రిది అల్లుడు.. ఇప్పుడు జట్టు పగ్గాలు తన చేతికి రావడంతో ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులకు సిద్ధమయ్యాడు. 

ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన పాక్.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు సిద్ధమవుతోంది. రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరిగే ఆఖరి పొట్టి సిరీస్ ఇదే కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఇక్కడే పరీక్షించాలని చూస్తోంది. ఈ తరుణంలో జట్టులో కీలక మార్పులు చేపడుతోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంకు స్థానచలనం కల్పిస్తోంది. కివీస్‌తో టీ20 సిరీస్ లో మహ్మద్ రిజ్వాన్, యువ ఆటగాడు సయీమ్ అయూబ్‌ ఓపెనింగ్ చేయనున్నారని సమాచారం. అదే జరిగితే బాబర్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తారనేది ఇక్కడ ప్రశ్న. 

ఐదు లేదా ఆరో స్థానంలో

న్యూజిలాండ్‌ సిరీస్‌లో బాబర్ ఆజం మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని ఆ దేశ మీడియా కోడై కూస్తోంది. ఓపెనింగ్ జోడీగా రిజ్వాన్, అయూబ్‌ ఆడనున్నారని.. బాబర్ మూడు లేదా నాలుగో స్థానంలో ఆడొచ్చని కథనాలు ప్రసారం చేస్తోంది. అదే జరిగితే ఫఖర్ జమాన్, షాన్ మసూద్ బ్యాటింగ్ స్థానాలపై అనిశ్చితి నెలకొంటోంది. ఒకవేళ వీరిద్దరూ జట్టులో ఉంటే పాక్ మాజీ కెప్టెన్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చనేది మరో కథనం.   

ఒకప్పుడు రాజులా వెలిగి.. 

జట్టు పగ్గాలు తన చేతిలో ఉన్నప్పుడు రాజులా వెలిగిన బాబర్ ఆజాం పరిస్థితి ఇప్పుడుమరీ దారుణంగా తయారయ్యింది. తుది జట్టులో హిట్టర్ కావాలనుకుంటే అతన్ని తప్పించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.దీంతో అతని అభిమానులు షాహీన్ అఫ్రిదికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పాకిస్తాన్ vs న్యూజిలాండ్ షెడ్యూల్

  • మొదటి టీ20 (జనవరి 12): ఈడెన్ పార్క్ (ఆక్లాండ్)
  • రెండో టీ20 (జనవరి 14): సెడాన్ పార్క్ (హామిల్టన్)
  • మూడో టీ20 (జనవరి 17): యూనివర్శిటీ ఓవల్ (డునెడిన్)
  • నాలుగో టీ20 (జనవరి 19): హగ్లీ ఓవల్ (క్రైస్ట్‌చర్చ్)
  • ఐదో టీ20 (జనవరి 21): హగ్లీ ఓవల్ (క్రైస్ట్‌చర్చ్)