డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలి : పలు పార్టీల నేతలు

డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలి : పలు పార్టీల నేతలు
  • సీఈఓతో సమావేశంలో పలు రాజకీయ పార్టీ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఎలక్షన్‌ కమిషన్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. అలాగే, ఆబ్సెంట్‌, డెత్‌ ఓటర్‌‌ లిస్ట్‌లు రాజకీయ పార్టీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వివిధ పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ వికాస్ రాజ్ బుధవారం బీఆర్‌‌కే భవన్‌లో సమావేశమయ్యారు.

అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని, డూబ్లికేట్ ఓట్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఇంటర్ స్టేట్ ఓట్లను కూడా తొలగించాలని పేర్కొన్నారు. బీజేపీ నుంచి మీటింగ్‌కు హాజరైన మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగిల్ డోర్ ఓట్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. కరీంనగర్‌‌లో ఓటరు నమోదులో భారీ అవకతవకలు జరిగాయని, అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.

అదేవిధంగా ఒకే పేరుతో దాదాపు 18 లక్షల ఓట్లు ఉండటంపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక్క మల్కాజిగిరి సెగ్మెంట్‌లోనే 2.70 లక్షల ఓట్లు సింగిల్ నేమ్ డబుల్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు చోట్ల కలిపి మొత్తం 30 లక్షల డబుల్‌ ఓట్లు ఉన్నాయని, వాటిని సెట్రైట్ చేయాలని కోరినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు జిల్లాలో ఒకేసారి ఎన్నికలు జరపాలని కోరామన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌‌ఎస్, సీపీఐతో పాటు మొత్తం 15 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహకంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓ వివరించారు. అనంతరం ఓటర్ల జాబితాపై చర్చించారు.