అమ్మిన ప్లాట్లే అమ్మి.. తొమ్మిది కోట్లకు ముంచిన్రు

అమ్మిన ప్లాట్లే అమ్మి.. తొమ్మిది కోట్లకు ముంచిన్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఒకరికి అమ్మిన ప్లాట్లనే మరొకరికి అమ్మిన రియల్టర్లు అమాయకులను తొమ్మిది కోట్లకు ముంచిన్రు. రిజిస్ట్రేషన్​ప్లాట్లని చెప్పి అమ్మిన ప్లాట్లను రిజిస్ట్రేషన్​చేయకుండా మోసం చేసిన రియల్టర్​పై బాధితులు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండేండ్ల కిందట పుడమి డెవలపర్స్​ ఆధ్వర్యంలో 13 ఎకరాల్లో వేసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్​ ప్లాట్లు అమ్ముతున్నారనే విషయం తెలిసి తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుకున్నామని బాధితులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని సోమవారం కలెక్టరేట్​ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్​అనుదీప్​కు వినతిపత్రం అందజేశారు. బాధితుల గోడును విన్న కలెక్టర్​ఈ కంప్లైంట్​ను ఎస్పీకి ఫార్వర్డ్​చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ  సుజాతనగర్​ మండలం మంగపేట, వేపలగడ్డ ప్రాంతంలో రెండేండ్ల కిందట పుడమి డెవలపర్స్​ ఆధ్వర్యంలో 13 ఎకరాల్లో వెంచర్లు వేశారని తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్​లో ఆఫీస్​ఓపెన్​ చేసి రిజిస్ట్రేషన్​ సౌకర్యం ఉందని చెప్పడంతో ప్లాట్లను బుక్​చేసుకున్నామని తెలిపారు. నాలుగు రోజుల్లో రూ. 9 కోట్ల మేర అడ్వాన్స్​ రూపంలో చెల్లించామని, అయితే రియల్టర్​అమ్మిన ప్లాట్లనే ఇతరులకు అమ్మడంతో అనుమానం వచ్చి నిలదీసినట్లు చెప్పారు. ప్లాట్లను రిజిస్ట్రేషన్​ చేయించాలని ఏజెంట్లతో పాటు యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతో ఎండీ మోహన్​గుప్తా హైదరాబాద్​కు మకాం మార్చారని తెలిపారు. మోహన్​గుప్తా ఉంటున్న అడ్రస్​తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆయనను తీసుకొచ్చి చుంచుపల్లి పోలీస్​స్టేషన్​లో అప్పగిస్తే డీఎస్పీ ఆఫీస్​కు తీసుకెళ్తున్నామని నమ్మించి మోహన్​ గుప్తాను పోలీసులు వదిలిపెట్టారని బాధితులు వాపోయారు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని లక్ష్మీదేవిపల్లి సీఐ గురుస్వామి తెలిపారు. బాధితులు ఎవరూ కంప్లైట్​ ఇవ్వలేదని, కంప్లైట్​ ఇస్తే ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం గమనార్హం. 

ఆగని అక్రమ వెంచర్లు
మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే రియల్టర్లు అక్రమ వెంచర్లు వేస్తున్నారు. ఆకట్టుకునే బ్రోచర్లు, మాయమాటలు చెప్పి ఏజెంట్లతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు కోట్లలో నష్టపోయారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిసర ప్రాంతాలైన పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు ప్రాంతంలోనే జరగడం గమనార్హం. ఏజెన్సీలో వెలుస్తున్న వెంచర్లపై ఆఫీసర్లు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.  ఇక జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీలోనూ అక్రమ వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారనే విమర్శలున్నాయి. సర్వారం, హేమచంద్రాపురం, సాటివారి గూడెం, లోతువాగు, సంజయ్​నగర్, నాయకుల గూడెం, చుంచుపల్లి తండా, విద్యానగర్​ కాలనీ, ప్రశాంతనగర్​, శేషగిరి నగర్, బావోజి తండా తదితర ఏజెన్సీ గ్రామపంచాయతీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్​బిజినెస్​చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నచిన్న ఇండ్లను నిర్మించి ఇంటి నెంబర్లు తీసుకుంటూ నాన్​ట్రైబ్స్​కు బహిరంగంగా అమ్ముతున్నారు. 

రూ 16 లక్షలు కట్టాను
పుడమి డెవలపర్స్ వద్ద మూడు ప్లాట్లకు సంబంధించి రూ.16 లక్షలు ఏడాదిన్నర కిందట చెల్లించాను. రిజిస్ట్రేషన్ కోసం తిప్పు కుంటున్నారు. సింగరేణిలో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బులను ఇందులో పెట్టాను. చాలా అన్యాయం చేశారు. కనీసం నా ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా చూపించలేదు. - శ్యాంసన్, కొత్తగూడెం

ఏడాదిన్నరగా తిరుగుతున్నం
పుడమి డెవలపర్స్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ ప్లాట్లు అమ్ముతుందని తెలిసి సింగరేణిలో పని చేసే 40 మందికి పైగా ప్లాట్లు కొన్నాం. అడ్వాన్సుగా ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు చెల్లించాం. ల్యాండ్ చూపించి పేపర్ మీద ప్లాట్లు ఇవేనని నమ్మించారు. రిజిస్ట్రేషన్ కోసం ఏడాదిన్నరగా తిరుగుతుంటే రేపుమాపంటూ తిప్పుతున్నారు. 9 కోట్ల వరకు వసూలు చేశారు. చివరికి హైదరాబాద్​కు వెళ్లి పుడమి డెవలపర్స్ ఎండీ మోహన్ గుప్తాను పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించాం.
- రజనీకాంత్, సింగరేణి ఉద్యోగి, కొత్తగూడెం