
- టర్కీలో రెస్క్యూ పనులు ఆపేసిన్రు
- విపత్తు నిర్వహణ శాఖ వెల్లడి
- భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ముప్పు
- శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరిగాయన్న ఆరోగ్య మంత్రి
ఇస్తాంబుల్: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో ఇప్పటిదాకా 46వేలకు పైగా ప్రజలు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రకటించారు. 14 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని సేఫ్‌గా బయటికి తీశారు. కేవలం టర్కీలోనే 3.45లక్షల అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. ఇంకా వేలాది మంది ఆచూకీ దొరకడం లేదు. భూకంపం సంభవించి 300 గంటలు దాటడంతో శిథిలాల కింద ప్రజలు బతికి ఉండే చాన్స్ లేదని అధికారులు భావిస్తున్నారు.
అందుకే రెస్క్యూ ఆపరేషన్ ను ఆదివారం రాత్రితో నిలిపేసినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ యూనస్ సెజర్ ప్రకటించారు. రెస్క్యూ కొనసాగిస్తుంటే భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ పెరిగే చాన్స్ ఉంటుందన్నారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరిగాయని, ఇప్పటి వరకు అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా ప్రకటించారు. అంటాక్యా సిటీలో శనివారం శిథిలాల కింది నుంచి ఐదుగురు సిరియన్ ఫ్యామిలీ మెంబర్స్‌ను రక్షించడానికి కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన రెస్క్యూ టీం ప్రయత్నించిందన్నారు. ఓ చిన్నారితో పాటు అందరినీ సేఫ్‌గా బయటికి తీశారని తెలిపారు.
డీ హైడ్రేషన్ కారణంగా చిన్నారి చనిపోయిందని వివరించారు. టర్కీలో సుమారు 40వేల మంది, సిరియాలో 6 వేల మంది చనిపోయారని ప్రకటించారు. ఏ ఏ ప్రాంతాల్లోని బిల్డింగ్లు కూలిపోయాయో గుర్తించి వాటి ఓనర్స్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే 100 మందిని అరెస్టు చేశామని, అందులో కాంట్రాక్టర్లు కూడా ఉన్నారన్నారు.