గ్రేటర్ వరంగల్‍ మేయర్‍ జనరల్

గ్రేటర్ వరంగల్‍  మేయర్‍ జనరల్
  • జీడబ్ల్యూఎంసీ మేయర్, మున్సిపల్​ చైర్​పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
  • 12 మున్సిపాలిటీల్లో 5 చోట్ల మహిళలకు అవకాశం

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‍ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం జీడబ్ల్యూఎంసీ మేయర్​, మున్సిపల్​ చైర్​పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఉమ్మడి వరంగల్​లో గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ తో పాటు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్‍ వరంగల్​లో 66 డివిజన్లు ఉండగా.. 12 మున్సిపాలిటీల పరిధిలో 260 వార్డులు ఉన్నాయి.

కాగా.. జనగామ,  భూపాలపల్లి, నర్సంపేట, ములుగు మున్సిపాలిటీ చైర్​పర్సన్లుగా బీసీ సామాజికవర్గానికే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉండే జీడబ్ల్యూఎంసీ మేయర్‍ పదవిని ఈసారి జనరల్​కు కేటాయించారు. వర్ధన్నపేట, పరకాల, తొర్రూర్‍ స్థానాలు కూడా జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి.

మహిళలకు సముచిత స్థానం..

ఉమ్మడి వరంగల్‍ మున్సిపాలిటీ రిజర్వేషన్లలో మహిళలకు సముచిత స్థానం దక్కింది. మొత్తం 13 స్థానాలు ఉండగా.. నర్సంపేట, ములుగు, కేసముద్రం, మహబూబాబాద్‍, మరిపెడ స్థానాల్లో మహిళలే పోటీ చేసేందుకు అవకాశం ఉంది. అలాగే జనరల్‍ 4 స్థానాల్లో అన్ని సామాజికవర్గాల మహిళా నేతలు పోటీ పడేందుకు వీలుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్‍ స్థానాల్లోనూ బీసీ మహిళలకు మున్సిపల్‍ పీఠం దక్కించుకునేందుకు రిజర్వేషన్లు కలిసివచ్చాయి. 

గ్రేటర్‍ పీఠం.. హోరాహోరీ

హైదరాబాద్‍ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ మేయర్‍ పదవి కోసం ఈసారి హోరాహోరి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బీసీ కోటాలో గుండు సుధారాణి మేయర్‍గా ఉన్నారు. బీఆర్‍ఎస్‍ ప్రభుత్వంలో మేయర్‍గా ఎన్నికైన సుధారాణి,  కాంగ్రెస్‍ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్‍ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఓసీ నేతలు ఈ పీఠం కోసం ఉవ్విల్లూరుతున్నారు. దీంతో ఓరుగల్లులో గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍ స్థానానికి తీవ్ర పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మేయర్‍, చైర్‍పర్సన్ల రిజర్వేషన్లు ఇలా..

జనరల్​: జీడబ్ల్యూఎంసీ, వర్ధన్నపేట, పరకాల, తొర్రూర్‍.

బీసీ జనరల్​: జనగామ, భూపాలపల్లి.

బీసీ మహిళ: నర్సంపేట, ములుగు.

ఎస్సీ జనరల్​: స్టేషన్‍ ఘన్‍పూర్‍, డోర్నకల్‍.

ఎస్సీ మహిళ: కేసముద్రం

ఎస్టీ మహిళ: మహబూబాబాద్‍

మహిళ జనరల్​: మరిపెడ