- తీవ్ర కసరత్తు నడుమ కొలిక్కి
- గ్రామాల్లో మొదలైన ఎన్నికల వాతావరణం
సూర్యాపేట, వెలుగు: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండు మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేపట్టింది. ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా లెక్కించి ప్రక్రియను చేపట్టారు. 2019 ఎన్నికల నాటి రిజర్వేషన్లతో రొటేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను అమలు చేశారు.
ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీవో కార్యాలయాల్లో సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డు సభ్యుల రిజర్వేషన్లను పూర్తిచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, హైకోర్టు రద్దు చేయడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా మార్పు లేకపోగా.. బీసీలకు కేటాయించిన సీట్లు భారీగా తగ్గాయి.
ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం
ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో వారం రోజులుగా కలెక్టరేట్‌లో బిజీబిజీగా ప్రక్రియ చేస్తున్నారు. రెండురోజులుగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో అమలైన రిజర్వేషన్ల వివరాలను అధికారులు సేకరించారు. ఈనెల 21న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించారు.
బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక, గత ఎన్నికల రిజర్వేషన్లను రొటేషన్ చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా డ్రా పద్ధతిలో కేటాయించారు. తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకున్నారు.
కేటాయించిన రిజర్వేషన్లు ఇలా..
సూర్యాపేట జిల్లాలో 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 111 స్థానాలు ఎస్టీలకు, 91 ఎస్సీలకు, 68 బీసీలకు, 218 స్థానాలు జనరల్ కేటగిరీలకు అధికారులు కేటాయించారు. మొత్తంగా 213 స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. ఎస్టీలకు 111, ఎస్సీలకు 91, బీసీలకు 177, జనరల్ కేటగిరికి 107 స్థానాలను కేటాయించారు.
ప్రస్తుత రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకపోగా.. బీసీలకు మాత్రం సుమారుగా 109 సీట్లు తగ్గాయి. ఈ మేరకు జనరల్ కేటగిరి స్థానాలు పెరిగాయి. కాగా 2019 పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఎస్టీలకు 111 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 97, బీసీలకు 65, జనరల్‌లకు 202 స్థానాల చొప్పున రిజర్వేషన్లు ఖరారయ్యాయి.జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా రిజర్వేషన్లు
గ్రామాల్లో సందడి..!
సర్పంచుల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఏమైనా రిజర్వేషన్లు మారాయా..? అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. జిల్లాలోని చివ్వెంల, పాలకీడు మండలాల్లో బీసీలకు ఒక్క సీటు కేటాయించలేదు. హుజూర్‌నగర్, నడిగూడెం మండలాల్లో ఎస్టీలకు ఒక్క స్థానం రిజర్వేషన్‌లో దక్కకపోవడం గమనార్హం.
డివిజన్ పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
సూర్యాపేట 249 73 46 27 103
కోదాడ 91 09 19 20 43
హుజుర్‌నగర్ 146 29 26 21 70
మొత్తం 486 111 91 68 216
