ఇచ్చిన హామీలు ఏమైనయ్? .. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మల్లన్నసాగర్ నిర్వాసితులు

ఇచ్చిన హామీలు ఏమైనయ్? ..  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మల్లన్నసాగర్ నిర్వాసితులు

గజ్వేల్, వెలుగు:  మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం భూములు, ఇండ్లు, ఊర్లు త్యాగం చేసినా తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, సమస్యలు పరిష్కరించడం లేదని నిర్వాసితులు మండిపడ్డారు. ఇప్పటి వరకు చాలా మందికి ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, ప్యాకేజీలు ఇవ్వలేదన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ వర్గల్ మండలం ముట్రాపల్లి, సింగాయిపల్లి ఎక్స్​రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుంది అని హెచ్చరించారు. దీనికి ముందు.. ఏటిగట్ట కిష్టాపూర్, పల్లెపహాడ్, వేముల ఘాట్, ఎర్రవల్లి, సింగారం, లక్ష్మాపూర్, బంజేరుపల్లి గ్రామాలకు చెందిన రైతులు, సర్పంచ్​లు ఆదివారం ఉదయం మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పల్లెపహాడ్ చౌరస్తాకు చేరుకున్నారు. 

రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేయాలని ర్యాలీగా బయలుదేరారు. ఓ దశలో సీఎం కేసీఆర్ ఫామ్​హౌజ్​ను ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి నిర్వాసితులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా పోలీసుల నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు పెడుతూ గౌరారం వైపు కదిలారు. ఫామ్ హౌజ్ దారి కూడా అటువైపే కావడంతో పోలీసులు వెంబడించి నిర్వాసితులను వర్గల్ మండలం సింగాయిపల్లి ఎక్స్​రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దీంతో వాళ్లు అక్కడే బైఠాయించి గతంలో పని చేసిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఇది ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని మల్లన్నసాగర్ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. చాలా మందికి ప్యాకేజీలు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు రాలేదన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇండ్ల నుంచి కూడా తమను వెళ్లిపోవాలని అంటున్నారని, తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. గ్రామాలు ఖాళీ చేయించే టైమ్​లో ఆఫీసర్లు ఎన్నో హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు అడిగితే మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడం లేదని, కాలనీలో కనీసం శ్మశాన వాటిక లేదన్నారు. పాత బొందలపైనే కొత్తగా పూడ్చాల్సి వస్తున్నదని వాపోయారు. విద్య, వైద్య సౌకర్యాల్లేక తిప్పలు పడ్తున్నామన్నారు. అప్పటి కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, ఆర్డీవో అనంత రెడ్డి వల్లే తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.