IND vs AUS : బ్యాటింగ్ వైఫల్యం.. ఓటమికి అదే కారణమా

IND vs AUS : బ్యాటింగ్ వైఫల్యం.. ఓటమికి అదే కారణమా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా, మూడో టెస్టులో చేతులెత్తేసింది. ఆట సాగిన రెండన్నర రోజుల్లో కనీసం ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఆసీస్ బౌలర్లు విజృంభించిన పిచ్ పై మన బౌలర్లు నెమ్మదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యూహాలను అమలు పరచడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే, భారత్ ఓటమికి విమర్శకులు మాత్రం కారణాలను వెతుకుతున్నారు.  పిచ్, బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ లోపాలే కారణమంటున్నారు.

ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మా బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో బాగా అర్థమైంది. రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాం. దాంతో ఆసీస్ గెలుపు ఖరారయింది. తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేసుంటే పరిస్థితి వేరుగా ఉండేది. సరిగ్గా ఆడితే పిచ్ తో సంబంధం లేకుండా ఫలితాలు వస్తాయి’ అని అన్నాడు.

పిచ్ ప్రయోగంలో విఫలం:

ఇండోర్ పిచ్ లో భారత్ కు మంచి రికార్డుంది. ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లో భారీ స్కోరు తేడాతో విజయం సాధించింది. అయితే, అలాంటి పిచ్ ను వదిలి క్యూరేటర్లు ఎర్రమట్టి, నల్లమట్టితో కూడిన పిచ్ ను తయారు చేశారు. దీనిపై కుదురుకోని టీమిండియా బంతి ఎటువైపు నుంచి టర్న్ అవుతుందో అర్థం కాక వికెట్లు ఇచ్చేశారు. కానీ, ఆసీస్ ప్లేయర్లు మాత్రం పిచ్ కండీషన్ ను అర్థం చేసుకొని చక్కగా రాణించారు. మొదటి రోజు 14 వికెట్లు పడితే, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్ ఐసీసీ సగటు రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ పొందొచ్చు.

బ్యాటింగ్ లో లోపం:

ఎనిమిదో వికెట్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న టాప్ క్లాస్ బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. రోహిత్, పుజారా, కోహ్లీ, జడేజా వంటి దిగ్గజ ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. అలాంటి బ్యాటర్లు పరుగులు చేయడం సరికదా.. బంతుల్ని డిఫెండ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి పుజారా మినమా (59 రెండో ఇన్నింగ్స్) ఏ బ్యాటర్ కూడా 30 పరుగులు కూడా  చేయలేకపోయారు. సీరిస్ మొత్తంలో సీనియర్ బ్యాటర్లంతా విఫలం అవుతున్నారు. ఈ సిరీస్ లో మిడిలార్డర్ ఉపయోగపడింది ఏమీ లేదు. 

కెప్టెన్సీ లోపం:

ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ సూపర్ కెప్టెన్సీ చేశాడు. అయితే, రోహిత్ మాత్రం తన వ్యూహాలను అమలు చేయడంలో, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. బౌలర్లను ఎంపిక చేయడం, జట్టు కూర్పులో తప్పులు చేశాడు. అవే మ్యాచు ఓటమికి కారణమయ్యాయి.