ఫోర్టిఫైడ్ రైస్ టెస్టింగ్ కోసం రిసోర్స్​ సెంటర్లు

ఫోర్టిఫైడ్ రైస్ టెస్టింగ్ కోసం రిసోర్స్​ సెంటర్లు
  • దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయం
  • ఇప్పటికే 12 రాష్ట్రాల్లో సెంటర్లు.. త్వరలో రాష్ట్రంలోనూ
  • నాణ్యతా ప్రమాణాల బాధ్యత ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐకి..
  • ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇండెక్స్​లో 11వ స్థానంలో తెలంగాణ

హైదరాబాద్ : త్వరలో దేశవ్యాప్తంగా రేషన్ షాపులు, అంగన్ వాడీలు, మిడ్ డే మీల్స్ ద్వారా సరఫరా కానున్న ఫోర్టిఫైడ్ రైస్ ప్రమాణాలను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఫుడ్ ఫోర్టిఫికేషన్ రిసోర్స్ సెంటర్ల(ఎఫ్ఎఫ్ఆర్సీ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో రక్తహీనత నివారణకు అవసరమైన ఐరన్, ఫోలిక్‌‌‌‌ యాసిడ్, విటమిన్ -బీ12 పోషకాల మిశ్రమంగా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా కేంద్రం ప్రారంభించింది. మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఏజెన్సీ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌ లో  ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేస్తోంది. వచ్చే నెలలో స్కూళ్లు ప్రారంభం కాగానే మిడ్ డే మీల్స్ కు ఈ బియ్యాన్నే సరఫరా చేయనుంది.

డాక్టర్లు సూచిస్తేనే ఫోర్టిఫైడ్​ రైస్ వాడాలె
రైస్ ఫోర్టిఫికేషన్ మిల్లుల్లోనే జరుగుతుంది. అయితే బియ్యం సేకరణ నుంచి పంపిణీ వరకు అన్ని దశల్లోను నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ) పర్యవేక్షించనుంది. రైస్ ఫోర్టిఫికేషన్ కోసం మిల్లుల ఎంప్యానెల్మెంట్, లైసెన్స్ జారీ ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐనే చేయనుంది. ఇందుకోసం ఎఫ్ఎఫ్ఆర్సీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఏపీ, చత్తీస్​గఢ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు తదితర 12 రాష్ట్రాల్లో ఇవి పనిచేస్తుండగా, మన రాష్ట్రంలోన త్వరలో ఏర్పాటు కానున్నాయి. ఈ సెంటర్లు రైస్ మిల్లర్లు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు(ఎఫ్బీఓ), సివిల్ సప్లయీస్, ఎఫ్సీఐ ఆఫీసర్ల ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ కోసం రిసోర్స్ హబ్‌‌‌‌గా పనిచేయనుంది. ఫోర్టిఫైడ్ రైస్ బ్యాగులపై +ఎఫ్ లోగో ప్రింట్ చేయనున్నారు. అలాగే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, మలేరియాతో బాధపడుతున్న వ్యక్తుల శరీరంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే టీబీ పేషెంట్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా తీసుకోలేదు. ఇలాంటి పేషెంట్లు ఐరన్ -ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వారిలో ఇమ్యునిటీతోపాటు అవయవాల పనితీరు తగ్గుతుంది. అలాంటి వారు డాక్టర్ల సూచనను అనుసరించి మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవచ్చనే హెచ్చరికను బస్తాలపై ప్రింట్ చేయనున్నారు.

ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇండెక్స్ లో రాష్ట్రానికి 11వ ర్యాంకు
ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ కు ఫస్ట్ ర్యాంకు రాగా, ఉత్తరప్రదేశ్ సెకండ్, తమిళనాడు థర్డ్, గుజరాత్ ఫోర్త్ ర్యాంకుల్లో ఉన్నాయి. తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉంది. ఫుడ్ ఫోర్టిఫికేషన్ పై అధికారులకు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్(ఎఫ్బీఓ), వినియోగదారులకు ఉన్న అవగాహన, అంగన్ వాడీలు, మిడ్ డే మీల్స్, రేషన్ షాపుల ద్వారా అందే ఆయిల్, పాలు, బియ్యం, గోధుమల్లో పోషకాలను చేర్చుతున్నారా లేదా అనే అంశాలతోపాటు ట్రైనింగ్ పొందిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ల్యాబ్ అనలిస్టులు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ సంఖ్యను బట్టి ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది.