- గత నెల 0.25 శాతంగా నమోదు
- మరోసారి వడ్డీరేట్ల కోతకు చాన్స్
న్యూఢిల్లీ: ధరల దడ రికార్డు స్థాయిలో తగ్గింది. జీఎస్టీ దిగిరావడం, కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు తక్కువగా ఉండటంతో గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతంతో రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. దాదాపు 380 నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించారు. 2012 బేస్‌ఇయర్ తరువాత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.44 శాతం ఉండగా, 2024 అక్టోబర్‌లో ఇది 6.21 శాతం ఉంది.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం, గత నెల ఆహార ద్రవ్యోల్బణం (-–) 5.02 శాతానికి తగ్గింది. జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రభావం, సానుకూల బేస్ ఎఫెక్ట్, నూనెలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చెప్పులు, ధాన్యాలు ఉత్పత్తులు, రవాణా కమ్యూనికేషన్ ద్రవ్యోల్బణం తగ్గడంతో ప్రధాన (హెడ్లైన్) ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.
ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద ఉండాలని, ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంకును ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. జీఎస్టీ తగ్గిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.
గ్రామాల్లో చాలా తక్కువ
ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 0.25 శాతంతో నెగెటివ్ జోన్లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా ఉంది. అత్యధిక ద్రవ్యోల్బణం కేరళలో (8.56 శాతం) ఉంది. జమ్మూ కాశ్మీర్లో 2.95 శాతం, కర్ణాటకలో 2.34 శాతం, పంజాబ్‌లో 1.81 శాతం, తమిళనాడులో 1.29 శాతంగా ఉంది. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం నెగెటివ్‌గా ఉంది.
ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ మాట్లాడుతూ, ఆహార ధరలు పడిపోవడం, అనేక వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు వలన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) 2026 ఆర్థిక సంవత్సరం సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి మరింత తగ్గించే అవకాశం ఉందని అన్నారు. రెండో క్వార్టర్లో జీడీపీ వృద్ధి ఊహించని విధంగా పెరగకపోతే, వడ్డీ రేట్లు 25 బేసిస్‌పాయింట్ల వరకు తగ్గవచ్చని ఆమె తెలిపారు.
ఎంపీసీ తదుపరి సమావేశం డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరగనుంది. సెప్టెంబర్ చివర్లో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం అక్టోబర్‌లో కనిపించిందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా అన్నారు.
