- రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.2.30 లక్షలు కొట్టేసిన్రు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: నల్లా బిల్లుల పేరిట సైబర్ స్కామర్లు కొత్త మోసాలకు తెరతీశారు. చిలకలగూడ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ నుంచి రూ.2.30 లక్షలు కాజేశారు. తొలుత జలమండలి అధికారి ముసుగులో బాధితుడికి ఒకరు కాల్ చేశారు. కన్స్యూమర్అకౌంట్నంబర్(కేన్) పాతది అయిపోయిందని, కొత్తది తీసుకోకపోతే నీటి సరఫరా నిలిపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వాటర్ బిల్లు పేరిట ఒక ఏపీకే ఫైల్పంపారు. దానిని బాధితుడు ఇన్స్టాల్ చేయగా, క్షణాల్లో ఫోన్ హ్యాక్ అయ్యింది.
ఆ తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు, కొద్దిసేపటికి మరో రూ.30 వేల విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు ఫిర్యాదుతో డబ్బులు బదిలీ అయిన ధీరజ్ కుమార్, రాజు పేరిట ఉన్న ఖాతాలను చిలకలగూడ పోలీసులు సీజ్ చేయించారు. అనంతరం చిలకలగూడ పోలీసుల సూచన మేరకు ప్రభాకర్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నల్లా బిల్లు పేరిట కొత్త రకమైన సైబర్ మోసాలు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
