కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మూలకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద నిర్మించారని.. కానీ అది కాస్త బుంగలు పడి బొందలగడ్డగా తయారైందని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇంజనీర్ల బృందం బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నదిని పరిశీలించి, ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని చూశారు.
స్థానిక ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి ప్రజలతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు హనుమంత రెడ్డి, భీమయ్య, పాత వెంకటరమణ మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తే ఉత్తర తెలంగాణకు మేలు జరిగేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ప్రారంభించడం కోసం సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేసేందుకు గతంలో మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని వారు గుర్తు చేశారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవుతుందని తాము గతంలోనే చెప్పామన్నారు.
గట్టి రాక్ ఉన్న ప్రాణహిత నదిలో ఎండాకాలం సైతం తాటి చెట్టు మునిగే స్థాయిలో నీళ్ళు ఉండడం గొప్ప విషయమన్నారు. దీన్ని బట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో తెలుస్తుందన్నారు. ఇక్కడ కట్టే ప్రాజెక్టు వందేండ్లు చెక్కు చెదరకుండా నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాలువలను, పైప్ లను పూర్తిగా వాడకంలోకి తెచ్చి కేవలం గ్రావిటీ ద్వారానే రోజుకు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉందన్నారు.
ప్రాజెక్ట్ ఆవశ్యకతను మరోసారి ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు ఈ పర్యటన చేస్తున్నామని తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా మైలారం సమీపంలో విజిట్ చేశాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు పుల్లారెడ్డి, శ్రీరామ్ రెడ్డి, రఘుమా రెడ్డి, వెంకటయ్య, హన్మంత్ రెడ్డి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు..