30 ఏళ్లుగా పసిబిడ్డలను అమ్మేస్తోంది.. రిటైర్డ్ నర్స్ దందా

30 ఏళ్లుగా పసిబిడ్డలను అమ్మేస్తోంది.. రిటైర్డ్ నర్స్ దందా

తమిళనాడులో సంచలనం

రిటైర్డ్ నర్స్ నెట్ వర్క్ పై పోలీసుల ఆరా

ఆమె భర్త, అంబులెన్స్ డ్రైవర్ అరెస్ట్

తమిళనాడు : అప్పుడే పుట్టిన శిశువులు, చిన్న పిల్లల అమ్మకం… తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఓ ప్రభుత్వాసుపత్రిలో రిటైర్డ్ నర్స్ ఆడియో టేప్ … అక్కడ వైరల్ అవుతోంది. ఆమె మాటలను బట్టి.. ఆ రాష్ట్రంలో 30 ఏళ్లుగా వందలమంది చిన్నపిల్లలను అమ్మేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

“మీకు ఆడపిల్ల కావాలా.. మగబిడ్డ కావాలా.. ”

“ వాళ్ల రంగు, రూపు, బరువును బట్టి రేట్ మారుతుంది”

“ఆరోగ్యంగా ఉంటే చాలా… లేక చూట్టానికి అందంగా కూడా ఉండాలా..”

“అడ్వాన్స్ గా రూ.30వేలు ఇవ్వండి…”

“లీగల్ గా వెళ్తే చాలా ఏళ్లవుతుంది.. ఇలా అయితే వెంటనే అయిపోతుంది”

నమక్కల్ జిల్లా రాసిపురం సర్కారు దవాఖానకు సంబంధించిన రిటైర్డ్ నర్స్ అముధ చెప్పిన మాటలు ఇవి. ఆమె వయస్సు 48 ఏళ్లు. సేలం జిల్లాలో పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులతో ఆమె మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో టేప్ 10 నిమిషాలు ఉంది.

చిన్నపిల్లలను అమ్మడమే నేరం. కానీ… ఆమె ఆ దందాను 30 ఏళ్లుగా చేస్తున్నట్టుగా ఆ ఆడియో టేప్ లో రికార్డైంది. పుట్టిన బిడ్డను తల్లిదండ్రులకే పుట్టినట్టుగా సర్టిఫికెట్ ను కూడా తయారుచేసి ఇస్తానని ఆమె హామీ ఇచ్చింది. ఏ బిడ్డ అయినా మినిమం రూ.3లక్షలు… అన్నీ బాగున్న బేబీ అయితే మినిమం రూ.4లక్షలు ఇవ్వాలని ఆమె చెప్పింది.

దీనిపై తమిళనాడు ఆరోగ్య శాఖ స్పందించింది. అముదను అదుపులోకి తీసుకుంది. 2012లో ఆమె సర్వీస్ నుంచి రిటైర్ అయినట్టు పోలీసులు చెప్పారు. ముగ్గురు పిల్లలను అమ్మినట్టుగా ఒప్పుకుందని తెలిపారు. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మున్సిపాలిటీ శాఖ వాళ్లు రూ.70వేలు అడిగేవారని ఆమె చెప్పినట్టు వివరించారు. ఆమె వెనుక ఓ పెద్ద నెట్ వర్క్ ఉందని పోలీసులు అంటున్నారు. ఆమె భర్తను… అంబులెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. నమక్కల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.