ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవటానికే కొత్త రాజ్యాంగం

ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవటానికే కొత్త రాజ్యాంగం

ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవటానికే కొత్త రాజ్యాంగం అంటున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణపై సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో పాలకులు ఒక వర్గంగా, ఓటర్లు మరో వర్గంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.  ‘కొన్ని కులాల వారు మాత్రమే పరిపాలన, రాజకీయం చేస్తున్నారు. మిగతావారు ఓటర్లుగానే ఉండిపోతున్నారు. రాజ్యాంగంలో అందరూ సమానమనే హక్కు ఉంది. దాంతో పాలకులకు రాజ్యాంగం అంటే నచ్చడంలేదు. అప్పటి రాజ్యాంగంలో రాజు చెప్పిందే వేదం. అలాంటి వారి వల్లే మన దేశం వెనకబడింది. మన దేశంతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు మనకంటే చాలా ముందుకెళ్లాయి. ఇప్పటికీ మనదేశంలో మౌలికసదుపాయాలు దక్కడంలేదు. దీనికి కారణం పాలకులకు రాజ్యాంగం అమలు చేయడం ఇష్టంలేదు. మనం కొంచెం ఆదమరిస్తే రాజ్యాంగం మార్చడానికి సిద్దంగా ఉన్నారు. భారత ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ రాజ్యాంగం అంటే ఇష్టం లేదు. రాజ్యాంగం మార్చడానికి చాలాసార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి. 

రాజ్యాంగం సవరించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ కొత్తది రాసుకోవడానికి వీలులేదు. సీఎం అయినా, పీఎం అయినా, రాష్ట్రపతి అయినా ఎవరికీ అధికారం లేదు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కరే రాయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు పెట్టింది రిజర్వేషన్లు మాత్రమే. అది కూడా కేవలం 5 శాతం మాత్రమే ప్రయోజనం పొందారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్యెల్యేలు అప్పర్  క్యాస్ట్ లీడర్లకు వత్తాసు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవటానికే కొత్త రాజ్యాంగం అంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిగా తెలంగాణలో పాలన జరగడం లేదు. అదేశిక సూత్రాల్లో మహిళలకు పరిపాలనలో సమాన అవకాశాలు కల్పించాలని ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఒక్క మహిళను కూడా మంత్రిగా నియమించలేదు. రాజ్యాంగానికి తూట్లు పోడుస్తా అంటే  ఊరుకునేది లేదు. అవసరమైతే మరో మిలియన్ మార్చ్ కి సిద్ధం కావాలి’ అని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ అన్నారు.