
నేను దళితుడిననే..డీజీపీ పోస్టింగ్ ఇవ్వలేదు
కేసీఆర్పై రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఫైర్
అన్ని అర్హతలు ఉన్నా.. అప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చారని విమర్శ
దళిత, గిరిజన ద్రోహి అని కామెంట్
హైదరాబాద్, వెలుగు : ‘‘నేను దళిత ఐపీఎస్ ను అయినందుకే కేసీఆర్ ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. దళితులంటే ఆయనకు చిన్నచూపు. 2017లో నాకు డీజీపీగా అర్హత ఉన్నప్పటికీ.. పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చాడు. కేసీఆర్ దళిత ద్రోహి”అని బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ కు దళిత ఓట్లే కావాలని, వారి సమస్యలు, అభివృద్ధి అవసరం లేదని ఫైర్ అయ్యారు. దళితులు, గిరిజనులను సీఎం మోసం చేస్తున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్ కు అంబేద్కర్ గుర్తుకు వచ్చారని విమర్శించారు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూను ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు.
‘‘కేసీఆర్ కు అంబేద్కర్ పై ఉన్న చిత్తశుద్ధి ఏంటో దళితులు ఆలోచించాలి. తొమ్మిదేండ్ల నుంచి కేసీఆర్ కు అంబేద్కర్ గుర్తుకు రాలేదు. కనీసం ఆయన జయంతి, వర్ధంతికి కూడా రాలేదు. దళితుడినే సీఎం చేస్తానని చెప్పి.. ఆయనే కుర్చీలో కూసున్నడు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. దళిత బంధు కూడా ఇస్తలేడు”అని బంగారు శృతి విమర్శించారు. దళిత ద్రోహి కేసీఆర్ అని, ఎవరూ ఆయన్ని నమ్మొద్దని కోరారు.