- పంచాయతీరాజ్ లో 48 మంది
- ఎడ్యుకేషన్ లో 25 మంది, ఆర్ అండ్ బీలో ఐదుగురు
హైదరాబాద్, వెలుగు : రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నరిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది. రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశించగా, అన్ని శాఖల అధికారులు లిస్టు తయారు చేసి సీఎస్‌కు పంపిస్తున్నారు. మొత్తం 32 శాఖలు, 120 హెచ్ వోడీల నుంచి సమాచారం రావాల్సి ఉందని.. అన్ని శాఖల నుంచి పూర్తి వివరాలు వచ్చాక లిస్టు రెడీ చేసి సీఎంవోకు పంపిస్తామని సెక్రటేరియెట్ అధికారులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది రిటైర్డ్ అధికారులు.. వివిధ శాఖల్లో తిరిగి రీఅపాయింట్ అయ్యారు. అలాంటి వాళ్లలో ఇప్పటికే కొందరిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు మిగిలినోళ్లపైనా ఫోకస్ పెట్టింది.
మిషన్ భగీరథలో 10 మంది..
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఎక్కువ మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. పంచాయతీరాజ్ లో మొత్తం 48 మంది పని చేస్తున్నారు. ఆర్ అండ్ బీలో ఐదుగురు ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఈఎన్సీ సంజీవరావు ఉండగా.. ఆర్ అండ్ బీలో ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు పని చేస్తున్నారు. మిషన్ భగీరథలో 10 మంది రిటైర్డ్ అధికారులు ఉండగా.. వీరిలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిపి ఆరుగురు చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈ, డీఈ, ఏజీఎం, ఎన్టీపీఏ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లుతో పాటు సీఈ, ఎస్ఈ లు, ఈఈలు ఉన్నారు.
విద్యాశాఖలో 25 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్టు తేలింది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 20 మంది ఉండగా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఐదుగురు ఉన్నారు. ఎస్సీఈఆర్టీలో ఆరుగురు, డైరెక్టరేట్‌లో ముగ్గురు రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్టు చెబుతున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ మహమూద్ తో పాటు మరో ముగ్గురు కన్సల్టెంట్లు ఉన్నారు. అయితే ఇంటర్మీడియెట్, కళాశాల విద్యాశాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లలో రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరూ లేరని అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో మాత్రం రిటైర్డ్ ప్రొఫెసర్లు చాలామందే ఉన్నారు.
