
తోటపల్లి రిజర్వాయర్ కోసం తీసుకున్న భూమిని తిరిగి ఇవ్వాలని కోహెడ మండలం రాంచంద్రాపూర్గ్రామానికి చెందిన రైతులు డిమాండ్చేస్తున్నారు. ‘నీళ్లొస్తొయంటే భూములిచ్చినం ఇప్పుడు ఫ్యాక్టరీ కడతామంటే ఎందుకిస్తం’ అని బాధిత రైతులు అంటున్నరు. రిజర్వాయర్నిర్మాణం కోసం పూర్వ కరీంనగర్జిల్లాలోని బెజ్జంకి మండలంలోని గాగీల్లాపూర్, తోటపల్లి, కోహెడ మండలం రాంచంద్రాపూర్, చిగురుమామిడి మండలం వరికోలు, నారాయణర్గ్రామాల నుంచి భూములను సేకరించారు.
తోటపల్లి రిజర్వాయర్ స్వరూపం..
2007లో అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో 0.959 టీఎంసీల నీటి సామర్థ్యంతో 49 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఐదు గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతుల నుంచి 1,603 ఎకరాల భూములు సేకరించారు. ఎకరాకు రూ.2.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. అయితే శంకుస్థాపన చేసిన కొద్దిరోజులకే పనులు పూర్తిగా ఆగిపోయినయ్.
కేన్సల్‌కు కారణం
2014లో టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి రాగానే తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం, ప్రయోజనాలపై అధ్యయనం చేసింది. దీంతో పెద్ద ఫాయిదా లేదని ఐదేళ్ల క్రితమే చెప్పింది. ఇదే సమయంలో ఇక్కడికి సమీపంలో గౌరవెల్లి ప్రాజెక్టు కడుతమని చెప్పింది. ‘తోటపల్లి’ కోసం సేకరించిన భూముల్లో సుమారు వంద ఎకరాల్లో గ్రావిటీ కెనాల్స్ నిర్మించగా, మిగిలిన 1,503 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చి వేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత జిల్లాల విభజన జరగడంతో బెజ్జంకి, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రాగా చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లాలో ఉండిపోయింది.
ఫ్యాక్టరీ వస్తుందని ప్రచారం..
ఐదేళ్ల క్రితమే భూములను తిరిగి ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు దీనిపై ఎలాంటి ఆర్డర్లు ఇయ్యలే. మరోవైపు తాము ప్రాజెక్టుకు ఇచ్చిన భూముల్లో పంటలను సాగుచేసుకుంటూ తీసుకున్న పరిహారం పైకం తిరిగి ఇస్తమని రైతులు ఆఫీసర్లకు చెబుతున్నరు. ఇదే సమయంలో ఈ జాగాలో ఫ్యాక్టరీ కడుతరనే ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నరు. ప్రభుత్వం సేకరించిన భూములకు ఎలాంటి పాస్‌బుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం పరంగా వచ్చే ఎలాంటి ప్రయోజనాలు అందుకోలేకపోయారు. మానుంచి తీసుకన్న భూములపై ఏ విషయం క్లీయర్‌చేయాలని కోరుతున్నరు.
ఆందోళన బాట…
రిజర్వాయర్ కట్టనందున మానుంచి తీసుకున్న భూములు మాకిచ్చేయాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకుంటలేదు కనుక ఆందోళన బాటవట్టాలని రైతులు అనుకుంటున్నరు. తోటపల్లి రిజర్వర్ రద్దు చేసినప్పుడు పనులు చేసిన భూమిని తప్ప మిగతా అంత రైతులకు తిరిగి ఇస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తిరిగి ఇయ్యనికి రెడీగా ఉన్నమంటున్నరు. సర్కార్ దీనిపై ఎటూ తేల్చక పోతుండడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నరు.
8.23 టీఎంసీలతో గౌరవెల్లి నిర్మాణం..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండలంలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. మొదట 1.04 టీఎంసీల సామర్థ్యంతో కట్టాలనుకున్న ప్రభుత్వం దాన్ని రీడిజైన్ చేసి 8.23 టీఎంసీలకు పెంచింది. గౌరవెల్లి రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల ద్వారా 1.06 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని గ్రామాలతో పాటు కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని గ్రామాలకు నీటిని అందించనున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి గండిపల్లి రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 54 వేల ఎకరాలను సాగునీటిని అందించే విధంగా ప్లాన్ చేశారు. మిడ్ మానేరు నుంచి గోదావరి జలాలను గతంలో తోటపల్లి రిజర్వాయర్ కోసం నిర్మించిన కాలువల ద్వారా గౌరవెల్లి ప్రాజక్టుకు నీటిని తరలించనున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ముగింపు దశకు చేరుకోగా సర్జ్‌పూల్ నిర్మాణం స్పీడ్‌గా సాగుతోంది.